YouVersion Logo
Search Icon

యోబు 5

5
1“యోబూ, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు!
నీవు ఏ దేవదూతల తట్టూ తిరుగలేవు!
2తెలివి తక్కువ మనిషి యొక్క కోపం వానినే చంపివేస్తుంది.
బుద్ధిహీనుని అసూయ వానినే చంపివేస్తుంది.
3బాగా వేరూనుకొని, వృద్ధిపొందుతున్న ఒక బుద్ధి హీనుణ్ణి చూశాను. (అతను బలంగా, క్షేమంగా ఉన్నా ననుకొన్నాడు).
అయితే అకస్మాత్తుగా వాని ఇల్లు శపించబడింది.
4ఆ బుద్ధిహీనుని పిల్లలు క్షేమంగా లేరు.
(న్యాయ స్థానంలో) వారిని ఆదుకొనేందుకు నగరద్వారం వద్ద ఎవ్వరూలేరు.
5ఆ బుద్ధిహీనుని పంటలను ఆకలిగొన్న ప్రజలు తీసుకొంటారు.
ఆకలిగొన్న ఆ మనుష్యలు ముండ్లలో పెరుగుతున్న ధాన్యపు గింజలను కూడా తీసుకొంటారు.
ఆశగలవారు అతని ఐశ్వర్యాన్ని తీసుకొంటారు.
6చెడ్డ కాలాలు మట్టిలోనుండి రావు.
కష్టం నేలలో నుండి పెరగదు.
7నిప్పులో నుండి రవ్వలు పైకి లేచినంత
నిశ్చయంగా మనిషి కష్టం కోసమే పుట్టాడు.
8కాని యోబూ, నేనే గనుక నీవైతే నేను దేవుని తట్టు తిరిగి
నా సమస్య ఆయనతో చెబుతాను.
9దేవుడు చేసే ఆశ్చర్యకరమైన వాటిని మనుష్యులెవ్వరు గ్రహించలేరు.
దేవుడు చేసే అద్భుతాలకు అంతం లేదు.
10దేవుడు భూమి మీద వర్షం కురిపిస్తాడు.
ఆయన పొలాలకు నీళ్లు పంపిస్తాడు.
11దీనుడైన మనిషిని దేవుడు లేవనెత్తుతాడు.
దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఆయన చాలా సంతోషపరుస్తాడు.
12తెలివిగల దుర్మార్గులకు విజయం కలుగకుండా దేవుడు వారి పథకాలను నివారిస్తాడు.
13దేవుడు తెలివిగల మనుష్యులను వారి కుయుక్తి పథకాల్లోనే పట్టేస్తాడు.
అందుచేత తెలివిగల మనిషి యొక్క పథకాలు విజయవంతం కావు.
14పగటివేళ సైతం ఆ తెలివిగల మనుష్యులు చీకటిలో వలె తడబడుతారు.
మధ్యాహ్నపు వేళల్లో సైతం రాత్రిపూట ఒకడు తడబడునట్లు తడువులాడుతారు.
15దేవుడు పేద ప్రజలను మరణం నుండి రక్షిస్తాడు.
బలవంతుల హస్తాలనుండి పేదలను ఆయనే రక్షిస్తాడు.
16కనుక పేద ప్రజలకు నిరీక్షణ ఉంది.
న్యాయంగా లేని దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడు.
17“దేవుడు సరిదిద్దే మనిషి సంతోషంగా ఉంటాడు.
కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను శిక్షించినప్పుడు, దానిని తోసిపుచ్చకు.
18దేవుడు చేసిన గాయాలకు
ఆయన కట్లు కడతాడు.
ఆయనే గాయపరుస్తాడు,
కాని ఆయన చేతులే తిరిగి స్వస్థపరుస్తాయి.
19ఆరు కష్టాలనుండి ఆయన నిన్ను రక్షిస్తాడు;
అవును, ఏడు కష్టాల్లో కూడా నీవు బాధించబడవు.
20కరువు వచ్చినప్పుడు దేవుడు నిన్ను
మరణంనుండి రక్షిస్తాడు.
యుద్ధంలో దేవుడు నిన్ను
మరణం నుండి కాపాడుతాడు.
21మనుష్యులు వాడిగల తమ నాలుకలతో నిన్ను గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు
దేవుడు నిన్ను రక్షిస్తాడు.
నాశనం వచ్చినప్పుడు
నీవు భయపడాల్సిన పనిలేదు.
22నాశనం, కరువును చూసి నీవు నవ్వుతావు.
అడవి జంతువులను చూసి నీవు భయపడాల్సిన అవసరం లేదు.
23నీ ఒడంబడిక దేవునితో ఉంది కనుక నీవు దున్నే పొలాల్లో బండలు ఉండవు.
మరియు అడవి మృగాలు ఎన్నటికీ నీ మీద పడవు.#5:23 హీబ్రూలో పొలాలలోవున్న రాళ్లతో ఒక నిబంధనను ఏర్పరచుకొంటావు. మరియు జంతువులు నీతో శాంతియుతంగా ఉంటాయి.
24నీ గుడారం క్షేమంగా ఉంది గనుక
నీవు శాంతంగా జీవిస్తావు.
నీవు నీ ఆస్తి లెక్కించగా
ఏదీ పోయి ఉండదు.
25నీకు చాలామంది పిల్లలు ఉంటారు.
నేలమీద గడ్డి పరకల్లా నీ పిల్లలు చాలామంది ఉంటారు.
26కోతకాలం వరకు సరిగ్గా పెరిగే గోధుమలా నీవు ఉంటావు.
అవును, నీవు పక్వమయిన వృద్ధాప్యం వరకు జీవిస్తావు.
27“యోబూ, ఈ విషయాలు మేము పరిశీలించాం. అవి సత్యమైనవని మాకు తెలుసు.
అందుచేత యోబూ, మేము చెప్పు సంగతులను విని, నీ మట్టుకు నీవే వాటిని తెలుసుకో.”

Currently Selected:

యోబు 5: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in