యోబు 4
4
ఎలీఫజు మాట్లాడుతున్నాడు
1-2అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు ఇచ్చాడు:
“నీతో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది నిన్ను కలవర పెడుతుందా?
నేను మాట్లాడాల్సి ఉంది!
3యోబూ, ఎంతో మంది మనుష్యులకు నీవు ఉపదేశాన్ని చేసావు.
బలహీన హస్తాలకు నీవు బలం ఇచ్చావు.
4తొట్రిల్లిన మనుష్యులకు నీ మాటలు ఆదరణ కలిగించాయి.
బలహీనమైన మోకాళ్లను నీవు బలపరిచావు.
5కాని ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధైర్య పడుతున్నావు.
కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తల్లడిల్లి పోయావు!
6నీవు దేవున్ని ఆరాధిస్తూ
ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు.
కనుక నీవు నీ విశ్వాస్యతను నమ్ముకోవాలి.
నీవు నిర్దోషివి కనుక అదే నీకు నిరీక్షణగా ఉండును గాక.
7యోబూ, ఇప్పుడు దీనిని గూర్చి ఆలోచించు నిర్దోషియైన మనిషి ఎవ్వరూ, ఎన్నడూ నాశనం చేయబడలేదు.
మంచి మనుష్యులు ఎన్నడూ నాశనం చేయబడలేదు.
8కీడు, కష్టం ప్రారంభించే మనుష్యులను నేను గమనించాను.
వారికి కూడా అవే సంభవిస్తాయి.
9దేవుని శ్వాస ఆ మనుష్యులను చంపేస్తుంది.
దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది.
10దుర్మార్గులు సింహాలవలె గర్జించి గుర్రు పెడతారు.
కాని దేవుడు దుర్మార్గులను నోరు మూయిస్తాడు.
మరియు దేవుడు వారి పళ్లు విరుగగొడతాడు.
11దుర్మార్గులు తినుటకు ఏమి లేని సింహాలవలె ఉంటారు.
వారు చస్తారు, వారి పిల్లలు చెదరి పోతారు.
12“రహస్యంగా నాకు ఒక సందేశం అందించబడింది.
ఆ గుసగుసలు నా చెవులు విన్నాయి.
13రాత్రివేళ వచ్చే ఒక చెడ్డ కలలా
అది నా నిద్రను భంగం చేసింది.
14నేను భయపడి వణకిపోయాను.
నా ఎముకలన్నీ వణకిపోయాయి!
ఎలీఫజు మాట్లాడుతున్నాడు
15ఒక ఆత్మ నా ముఖాన్ని దాటిపోగా
నా శరీరం మీది వెంట్రుకలు వేగంగా చలించాయి!
16ఆత్మ ఇంకా నిలిచి ఉంది.
కాని అదేమిటో నేను చూడలేకపోయాను.
ఒక ఆకారం నా కళ్ల ఎదుట నిలిచింది.
నిశ్శబ్దంగా ఉంది.
అప్పుడు నేను ఒక మెల్లని స్వరం చెప్పడం విన్నాను.
17‘ఒక మనిషి దేవుని కంటే ఎక్కువ (నీతిమంతుడు)గా ఉండలేడు.
మనిషి తనను చేసిన వానికంటే ఎక్కువ పరిశుద్ధంగా ఉండలేడు.
18దేవుడు తన పరలోకపు సేవకులను కూడా నమ్మలేడు.
తన దేవదూతల విషయంలో కూడా దేవుడు తప్పులు పట్టుకోగలడు
19కనుక దేవుడు మనుష్యుల విషయంలో మరి ఎక్కవ తప్పులు పట్టుకోగలడు.
మనుష్యులు మట్టి ఇండ్లలో#4:19 మట్టి ఇండ్లు మానవ శరీరం. నివసిస్తారు.
ఈ మట్టి ఇండ్ల పునాదులు మట్టిలో ఉన్నాయి.
వారు చిమ్మెట కంటే తేలికగా చావగొట్టబడతారు.
20సూర్వోదయం, సూర్యాస్తమయం మధ్య ఈ మనుష్యులు మరణిస్తారు, వారిని ఎవ్వరూ గుర్తించరు.
వారు శాశ్వతంగా నశించిపోతారు.
21వారి గుడారాల తాళ్లు లాగివేయబడతాయి,
ఈ మనుష్యులు బుద్ధిలేకుండా చస్తారు.’”
Currently Selected:
యోబు 4: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International