YouVersion Logo
Search Icon

మార్కు 11

11
1వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి 2–మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిద పిల్ల కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు; దానిని విప్పి, తోలుకొని రండి. 3ఎవడైనను– మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్ము నడిగినయెడల–అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. 4-5వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా, అక్కడ నిలిచియున్న వారిలో కొందరు– మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి. 6అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.
7వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను. 8అనేకులు తమ బట్టలను దారి పొడుగుననుపరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలనుపరచిరి. 9మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును
–జయము#11:9 మూలభాషలో–హోసన్నా.
ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక
10వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక
సర్వోన్నతమైన స్థలములలో జయము#11:10 మూలభాషలో–హోసన్నా.
అని కేకలు వేయుచుండిరి.
11ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పండ్రెండుమందితోకూడ బేతనియకు వెళ్లెను.
12మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని 13ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు. 14అందుకాయన–ఇకమీదట ఎన్నటి కిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను ; ఇది ఆయన శిష్యులు వినిరి.
15వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి 16దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. 17మరియు ఆయన బోధించుచు
–నా మందిరము సమస్తమైన అన్యజనులకు
ప్రార్థన మందిరమనబడును
అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.
18శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి.
19సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను.
20ప్రొద్దునవారు మార్గమున పోవుచుండగా ఆ అంజూ రపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి. 21అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని–బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. 22అందుకు యేసు వారితో ఇట్లనెను–మీరు దేవునియందు విశ్వాసముంచుడి. 23ఎవడైనను ఈ కొండను చూచి–నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
25మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్నయెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. 26అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.#11:26 అనేక ప్రాచీన ప్రతులలో–మీరు క్షమింపని యెడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు, అని కూర్చబడియున్నది.
27వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకువచ్చి 28–నీవు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి. 29అందుకు యేసు–నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. 30యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను. 31-32అందుకు వారు–మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయన – ఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును; మనుష్యులవలన కలిగిన దని చెప్పుదుమా అని తమలోతాము ఆలోచించుకొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్త యని యెంచిరి 33గనుక ప్రజలకు భయపడి–ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు–ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy