YouVersion Logo
Search Icon

మార్కు 12

12
1ఆయన ఉపమానరీతిగా వారికి బోధింపనారం భించెను; ఎట్లనగా – ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురముకట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరముపోయెను. 2పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు, కాపులయొద్దకు అతడు ఒక దాసునిపంపగా 3వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి. 4మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి. 5అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులను పంపగా, వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. 6ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక–వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. 7అయితే ఆ కాపులు–ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని 8అతనిని పట్టుకొని చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరి. 9కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు
10–ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలకు తలరాయి ఆయెను
11ఇది ప్రభువువలననే కలిగెను
ఇది మన కన్నులకు ఆశ్చర్యము
అను లేఖనము మీరు చదువలేదా? అని అడుగగా 12తమ్మునుగూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి.
13వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. 14వారు వచ్చి–బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్ని చ్చుట న్యాయమా కాదా? 15ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి–మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము#12:15 దేనారము ఇంచు మించు అర్ధరూపాయి కావచ్చును. నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. 16వారు తెచ్చిరి, ఆయన–ఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారు–కైసరువి అనిరి. 17అందుకు యేసు – కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.
18పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి 19–బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను. 20ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను 21గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను,వాడును సంతానము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను. 22ఇట్లు ఏడుగురును సంతానములేకయే చనిపోయిరి. అందరివెనుక ఆ స్ర్తీ యు చనిపోయెను. 23పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి. 24అందుకు యేసు–మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు. 25వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు. 26వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు–నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. 27ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడు చున్నారని వారితో చెప్పెను.
28శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి–ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. 29అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. 30నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. 31రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను 32ఆ శాస్త్రి–బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. 33పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను. 34అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి–నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
35ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా –క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నా రేమి?
36నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు
నీవు నా కుడివైపున కూర్చుండుమని
ప్రభువు నా ప్రభువుతో చెప్పెను
అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను. 37దావీదు ఆయ నను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి.
38మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను 39సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుచు 40విధవరాండ్ర యిండ్లు దిగమ్రిం గుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను.
41ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. 42-43ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి–కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 44వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy