YouVersion Logo
Search Icon

యోబు 9

9
బిల్దదుకు యోబు జవాబు
1అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
2“అవును, నీవు చెప్పేది సత్యమే అని నాకు తెలుసు.
అయితే మానవుడు దేవుని దృష్టిలో ఎలా నిర్దోషిగా ఉండగలడు?
3ఒక మనిషి దేవునితో వాదించలేడు. దేవుడు వెయ్యి ప్రశ్నలు అడుగవచ్చు.
కానీ ఒక్కదానికి కూడా ఏ మనిషీ జవాబు యివ్వలేడు.
4దేవుని జ్ఞానం లోతైనది, ఆయన శక్తి గొప్పది.
దేవునితో పోరాడిన ఏ మనిషీ బాధపడకుండా తప్పించుకోలేడు.
5దేవుడు పర్వతాలను కదిలిస్తాడు. కాని వాటికి తెలియదు.
ఆయనకు కోపం వచ్చినప్పుడు పర్వతాలను తలక్రిందులు చేస్తాడు.
6భూమిని కంపింప చేయటానికి దేవుడు భూకంపాలను పంపిస్తాడు.
భూమి పునాదులను దేవుడు కంపింపజేస్తాడు.
7దేవుడు సూర్యునితో మాట్లాడి దానిని ఉదయించకుండా చేయగలడు.
ప్రకాశించకుండా, నక్షత్రాలకు ఆయన తాళం వేసి పెట్టగలడు.
8దేవుడే ఆకాశాలను చేశాడు.
మహాసముద్ర తరంగాల మీద ఆయన నడుస్తాడు.
9“స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనేవాటిని చేసినవాడు ఆయనే.
దక్షిణ ఆకాశాన్ని దాటిపోయే గ్రహాలను ఆయన చేశాడు.
10మనుష్యులు గ్రహించలేని ఆశ్చర్యకర కార్యాలను దేవుడు చేస్తాడు.
దేవుని మహా అద్భుతాలకు అంతం లేదు.
11దేవుడు నన్ను దాటి వేళ్లేటప్పుడు నేను ఆయనను చూడలేను.
దేవుడు పక్కగా వెళ్లేటప్పుడు ఆయన గొప్పతనాన్ని నేను గ్రహించలేను.
12దేవుడు దేనినై నా తీసివేస్తే,
ఏ ఒక్కరూ ఆయన్ని వారించలేరు.
‘ఏమిటి నీవు చేస్తున్నది?’
అని ఎవ్వరూ ఆయనతో అనలేరు.
13దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు.
రాహాబు సహాయకులకు కూడా దేవుడంటే భయం.”
14యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను దేవునితో వాదించలేను.
ఆయనతో వాదించేందుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు.
15యోబు అనే నేను నిర్దోషిని. కానీ ఆయనకు నేను జవాబు ఇవ్వలేను.
నా న్యాయమూర్తిని (దేవుని) ప్రాధేయపడడం మాత్రమే నేను చేయగలిగింది అంతా.
16ఒకవేళ నేను ఆయనకు మొరపెట్టినా, ఆయన జవాబిచ్చినా,
దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను నమ్మను.
17నన్ను అణచివేయటానికి దేవుడు తుఫానులు పంపిస్తాడు.
ఏ కారణం లేకుండానే ఆయన నాకు ఇంకా ఎక్కువ గాయాలు కలిగిస్తాడు.
18దేవుడు నన్ను మళ్లీ శ్వాస పీల్చనీయడు.
ఆయన నన్ను ఇంకా ఎక్కువ కష్టపెడతాడు.
19నేను దేవుణ్ణి ఓడించలేను.
దేవుడు శక్తిమంతుడు.
దేవుని న్యాయస్థానానికి వెళ్లి నాకు న్యాయం చేకూర్చేటట్టు నేను చేయలేను.
దేవుణ్ణి న్యాయస్థానానికి రమ్మని ఆయనను ఎవరు బలవంతం చేస్తారు?
20యోబు అనే నేను నిర్దోషిని, కాని నేను చెప్పే మాటలు నేను దోషిలా కనబడేటట్టు చేస్తాయి.
కనుక, నేను నిర్దోషిని, కాని నా నోరు నేను దోషిని అని ప్రకటిస్తుంది.
21నేను నిర్దోషిని, కాని నన్ను గూర్చి నేను లక్ష్య పెట్టను.
నా స్వంత జీవితం నాకు అసహ్యం.
22జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
కనుక ‘దేవుడు నిర్దోషులను, దుర్మార్గులను కూడా నాశనం చేస్తాడు’ అని నేను తలస్తాను.
23ఏదో ఒక దారుణం జరిగి ఒక నిర్దోషి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అతని శ్రమను చూసి దేవుడు నవ్వుతాడు.
24భూమిని దుర్మార్గుడు చేజిక్కించుకున్నప్పుడు దేవుడు న్యాయమూర్తులను గుడ్డివాళ్లను చేస్తాడా?
ఇది దేవుడు చేయకపోతే ఇంకెవరు చేశారు?
25“పరుగెత్తేవాని కంటె వేగంగా నా రోజులు గడిచి పోయాయి.
నా రోజులు ఎగిరిపోతున్నాయి, వాటిలో సంతోషం లేదు.
26జమ్ము పడవలు పోయేలా నా రోజులు వేగంగా పోతున్నాయి.
పక్షిరాజులు తాము పట్టుకొన్న జంతువుల మీదికి దూసుకు వచ్చినట్లుగా నా రోజులు వేగంగా గడిచి పోతున్నాయి.
27“నేను ఆరోపణలు చేయను,
‘నేను నా బాధ మరచిపోతాను, నా ముఖం మార్చుకొని, నవ్వుతూ ఉంటాను’ అని ఒక వేళ నేను చెప్పినా,
28నాకు నా శ్రమ అంతటిని గూర్చి ఇంకా భయమే.
ఎందుకంటే నేను దోషిని అని దేవుడు ఇంకా చెబుతున్నాడని నాకు తెలుసు గనుక.
29నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది.
కనుక నేను ఇంకా ఎందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. పోనీ దానిని, ‘మర్చిపో’ అని అంటాను నేను.
30మంచుతో నన్ను నేను కడుగుకొన్నా,
సబ్బుతో నేను నా చేతులు కడుగుకొన్నా
31దేవుడు నన్ను చావు గోతిలో#9:31 చావు గోతి అక్షరాల గోరి. పడవేస్తాడు.
అప్పుడు నా వస్త్రాలే నన్ను ద్వేషిస్తాయి.
32దేవుడు నాలా మనిషి కాడు. అందుకే నేను ఆయనకు జవాబు ఇవ్వలేను.
న్యాయస్థానంలో మేము ఒకరి నొకరం కలుసుకొలేం.
33మాకు మధ్య నిలబడేందుకు ఎవరైనా ఉంటే బాగుండును.
మా ఇద్దరికీ న్యాయంగా తీర్పు తీర్చేవారు ఎవరైనా ఉంటే బాగుండును.
34దేవుని శిక్షా దండాన్ని తీసివేసుకొనే వారు ఎవరైనా ఉంటే బాగుండును.
అప్పుడు దేవుడు నన్ను ఇంకెంత మాత్రము భయపెట్టడు.
35అప్పుడు నేను దేవునికి భయపడకుండా నేను చెప్పదలచుకొన్నది చెప్పగలుగుతాను.
కానీ ఇప్పుడు నేను అలా చేయలేను.

Currently Selected:

యోబు 9: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in