YouVersion Logo
Search Icon

యోబు 8

8
బిల్దదు యోబుతో మాట్లాడటం
1అప్పుడు షూహీ వాడైన బిల్దదు జవాబిచ్చాడు:
2“ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు?
నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి.
3దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు.
సక్రమంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ చెరపడు.
4నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, ఆయన వారిని శిక్షించాడు.
వారు వారి పాపాలకు వెల చెల్లించారు.
5అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు.
ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు.
6నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు.
మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు.
7నీకు మొదట ఉన్నదానికంటె
ఎక్కువగా వస్తుంది.
8“యోబూ, వృద్ధులను అడిగి వారు తమ పూర్వీకుల నుండి
ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో.
9ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక.
మనకు ఏమీ తెలియదు.
భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి.
10చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు.
వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు.
11“బిల్దదు చెప్పాడు, ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా?
నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా?
12లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి.
వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి.
13దేవుణ్ణి మరచిపోయే ఏ మనిషైనా సరే ఆ రెల్లులాగానే ఉంటాడు.
దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు.
14ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది.
ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది.
15ఆ మనిషి సాలెగూటిమీద ఆనుకోగా
ఆ గూడు తెగిపోతుంది.
అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు
కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు.
16సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు.
ఆ మొక్క కొమ్మలు తోట అంతటా వ్యాపిస్తాయి.
17అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి
ఆ బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది.
18కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడినప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు.
‘నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడలేదు’ అని ఆ తోట అంటుంది.
19కనుక ఆ మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే.
తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి.
20నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు.
చెడ్డ మనుష్యులకు ఆయన సహాయం చేయడు.
21అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను,
నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు.
22కానీ నీ శత్రువులను దేవుడు సిగ్గుపరుస్తాడు.
దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు.”

Currently Selected:

యోబు 8: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in