YouVersion Logo
Search Icon

2 పేతురు పత్రిక 2

2
భ్రష్ట బోధకుల గురించి హెచ్చరికలు: వారు రక్తబలి మూలమైన విమోచనను తిరస్కరిస్తారు
1గతంలో కూడా ఇశ్రాయేలీయుల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు లేస్తారు. వారు నాశనకరమైన విరుద్ధ సిద్ధాంతాలను రహస్యంగా ప్రవేశపెడుతూ, తమ కోసం వెల చెల్లించిన ప్రభువును కూడా నిరాకరిస్తారు. దాని ద్వారా తమ మీదికి తామే త్వరగా నాశనం తెచ్చుకుంటారు. 2అనేక మంది వారి విచ్చలవిడితనాన్ని అనుకరిస్తారు. అందువల్ల సత్యమార్గానికి అపకీర్తి కలుగుతుంది. 3ఈ అబద్ధ బోధకులు అత్యాశతో, కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారికి విధించిన శిక్ష పూర్వకాలం నుండి వారికోసం సిద్ధంగా ఉంది. వారి నాశనం నిద్రపోదు.
4పూర్వం పాపం చేసిన దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా దేవుడు వారిని సంకెళ్లకు అప్పగించి దట్టమైన చీకటిలో తీర్పు వరకూ ఉంచాడు. 5అలాగే దేవుడు పూర్వకాలపు లోకాన్ని కూడా విడిచిపెట్టకుండా, నీతిని ప్రకటించిన నోవహును, మిగతా ఏడుగురిని కాపాడి, దైవభక్తి లేని ప్రజల మీదికి జల ప్రళయం రప్పించాడు.
6దైవభక్తి లేని ప్రజలకు కలిగే వినాశనానికి ఉదాహరణగా దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలపై తీర్పు విధించి వాటిని బూడిదగా మార్చాడు. 7దైవభయం లేని దుర్మార్గుల లైంగిక వికార ప్రవర్తన చేత మనస్తాపానికి గురైన నీతిపరుడైన లోతును రక్షించాడు. 8దినదినం ఆ దుర్మార్గుల మధ్య ఉంటూ, వారు చేసే అక్రమమైన పనులు చూస్తూ, వింటూ, నీతిగల అతని మనసు దుఃఖిస్తూ ఉండేది. 9ఆ విధంగా, దైవభక్తి ఉన్నవారిని పరీక్షల నుండి ఎలా కాపాడాలో ప్రభువుకు తెలుసు, తీర్పు రోజున శిక్ష పొందేవరకూ దుర్మార్గులను ఎలా నిర్బంధించి ఉంచాలో కూడా ప్రభువుకు తెలుసు.
10ముఖ్యంగా ప్రభుత్వాన్ని తోసిపుచ్చుతూ, అపవిత్రమైన శరీర ఆశలను తీర్చుకుంటూ, తెగువతో, అహంకారంతో, పరలోక సంబంధులను దూషించడానికి భయపడని వారి విషయంలో ఇది నిజం. 11దేవదూతలు వారికంటే ఎంతో గొప్ప బలం, శక్తి కలిగి ఉండి కూడా ప్రభువు ముందు వారిని దూషించి వారి మీద నేరం మోపడానికి భయపడతారు.
12పశుప్రవృత్తి గల ఈ మనుషులైతే తమకు తెలియని సంగతులను గురించి దూషిస్తారు. వారు బంధకాలకు, నాశనానికి తగినవారు. వారు తమ దుర్మార్గత వల్ల పూర్తిగా నశించిపోతారు. 13వారి చెడుతనానికి ప్రతిఫలంగా వారికి హాని కలుగుతుంది. వారు పట్టపగలు సుఖభోగాల్లో ఉంటారు. మచ్చలుగా, కళంకాలుగా ఉంటారు. వారు, మీతో కూడా విందుల్లో పాల్గొంటూనే తమ భోగాల్లో సుఖిస్తూ ఉంటారు. 14వారి కళ్ళు వ్యభిచారపు చూపులతో నిండి ఉండి, ఎడతెగక పాపం చేస్తూ ఉంటారు. వారు, నిలకడ లేని వారిని తప్పుదారి పట్టడానికి ప్రేరేపిస్తారు. వారి హృదయాలు ఎప్పుడూ పేరాశతో సిద్ధంగా ఉంటాయి. వారు శాపానికి గురైన ప్రజలు.
భ్రష్ట బోధకులు బిలాము వంటి వారు
15వారు, అవినీతి సంబంధమైన జీతం కోసం ఆశపడిన బెయోరు కుమారుడు బిలామును అనుసరించి తప్పిపోయారు. సక్రమ మార్గాన్ని వదిలిపెట్టారు. 16కాని, బిలాము చేసిన అతిక్రమానికి మాటలు రాని గాడిద మానవ స్వరంతో మాటలాడడం ద్వారా అతన్ని గద్దించి, ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది.
వారు ఆత్మలో దివాలాకోరులు
17ఈ మనుషులు నీళ్ళులేని బావులు. బలమైన గాలికి కొట్టుకుపోయే పొగమంచు వంటి వారు. గాడాంధకారం వీరి కోసం సిద్ధంగా ఉంది.
వారు డంబాలు పలుకుతారు
18వారు పనికిమాలిన గొప్పలు మాట్లాడుతూ ఉంటారు. వారు చెడు మార్గంలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని తమ శరీర సంబంధమైన చెడు కోరికలతో వెనుదిరిగేలా ప్రేరేపిస్తారు.
వారిది విచ్చలవిడి బతుకు
19వారే స్వయంగా దుర్నీతికి బానిసలై ఉండి, ఇతరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తారు. ఒక వ్యక్తిని ఏది జయిస్తుందో దానికి అతడు బానిస అవుతాడు. 20ఎవరైనా ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు విషయంలో అనుభవజ్ఞానం వల్ల ఈ లోకపు అపవిత్రతను తప్పించుకొన్న తరువాత దానిలో మళ్లీ ఇరుక్కుని దాని వశమైతే, వారి మొదటి స్థితి కన్నా చివరి స్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది.
21వారు, నీతి మార్గాన్ని తెలుసుకున్న తరువాత తమకు అందిన పవిత్ర ఆజ్ఞ నుండి తప్పిపోవడం కన్నా అసలు ఆ మార్గం వారికి తెలియకుండా ఉండడమే మేలు. 22“కుక్క తాను కక్కిన దాన్ని తిన్నట్టుగా, కడిగిన తరువాత పంది బురదలో పొర్లడానికి తిరిగి వెళ్ళినట్టుగా” అని చెప్పిన సామెతలు వీళ్ళ విషయంలో నిజం.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in