YouVersion Logo
Search Icon

2 పేతురు పత్రిక 1

1
గొప్ప క్రైస్తవ సుగుణాలు
1యేసు క్రీస్తుకు బానిస, అపొస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుడూ, రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాకు సమానంగా అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవారికి రాస్తున్న సంగతులు. 2దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!
3తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.
5ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం, 6జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి, 7భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి. 8ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.
9కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలనుండి దేవుడు శుభ్రపరిచాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు. 10కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు. 11దీని ద్వారా మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యంలోకి ఘనమైన ప్రవేశం మీకు దొరుకుతుంది.
12వీటి గురించి మీకు ముందే తెలిసినా, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నా ఈ సంగతులు మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాను. 13నేను ఈ శరీరం అనే గుడారంలో ఉన్నంత వరకూ ఇవి మీకు గుర్తు చేయడం మంచిదని భావిస్తున్నాను. 14మన ప్రభు యేసు క్రీస్తు ముందుగానే నాకు వెల్లడి చేసిన ప్రకారం నేను త్వరలోనే ఈ శరీరం వదిలేస్తానని నాకు తెలుసు. 15నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను.
లేఖనాల ఘనత
16ఎందుకంటే, మన ప్రభు యేసు క్రీస్తు శక్తిని, ఆయన రాకడను గురించి చాకచక్యంగా అల్లిన కల్పనా కథలను మేము మీకు చెప్పలేదు, ఆయన గొప్పదనాన్ని కళ్ళారా చూసిన వారుగా చెప్పాం. 17ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి ఘనత, మహిమ పొందగా, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను” అనే గొప్ప మహిమగల దైవస్వరం వచ్చినప్పుడు, 18ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని స్వయంగా విన్నాం.
19ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు. 20లేఖన ప్రవచనాలు మనిషి ఊహల్లో నుండి పుట్టలేదని మీరు ముందుగా గ్రహించాలి. 21ప్రవచనం ఎప్పుడూ మనిషి ఉద్దేశంలో నుండి పుట్టలేదు, పరిశుద్ధాత్మతో నిండిన మనుషులు దేవుని మూలంగా మాట్లాడగా వచ్చింది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in