YouVersion Logo
Search Icon

2 పేతురు పత్రిక 3

3
ప్రభువు రాక, ప్రభువు దినం
1ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. యథార్ధమైన మీ మనసును పురికొల్పడానికి జ్ఞాపకం చేస్తూ వీటిని రాస్తున్నాను. 2పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞనూ మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.
ప్రభువు రెండవ రాకను చాలామంది నమ్మడం లేదు
3ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు. 4“ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. 5చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలో నుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ, 6ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ, 7అదే వాక్కును బట్టి ఇప్పటి ఆకాశం, భూమి భక్తిహీనులకు జరిగే తీర్పు రోజు వరకు, మంటల్లో నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నదనీ వారు ఉద్దేశ పూర్వకంగా మరచిపోతారు.
8కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి. 9కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.
ప్రభువు దినం
10అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి. 11ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాల్లో ఏ విధంగా జీవించాలి?
12దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి 13అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.
14కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి. 15మన ప్రభువు చూపించే సహనం మన రక్షణ కోసమే అని గ్రహించండి. ఆ విధంగానే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంతో రాశాడు. 16అతడు ఈ సంగతులను గురించి తన లేఖలన్నిటిలో మాట్లాడుతున్నాడు. అయితే వాటిలో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. పామరులు, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరించి, వారి నాశనం వారే తెచ్చుకుంటారు.
17కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్తపడండి. 18మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in