Bible App logo
Search Icon

యెషయా 55

55
దాహంతో ఉన్నవారికి ఆహ్వానం
1దాహంతో ఉన్నవారలారా,
నీళ్ల దగ్గరకు రండి.
డబ్బులేని వారలారా,
మీరు వచ్చి కొని తినండి!
డబ్బు లేకపోయినా ఏమీ చెల్లించకపోయినా,
ద్రాక్షరసం, పాలు కొనండి.
2ఆహారం కాని దాని కోసం మీరెందుకు డబ్బు ఖర్చుపెడతారు?
తృప్తి కలిగించని వాటికోసం ఎందుకు కష్టార్జితాన్ని వెచ్చిస్తారు?
వినండి, నా మాట వినండి, ఏది మంచిదో దానిని తినండి,
అప్పుడు మీరు గొప్ప వాటిని ఆనందిస్తారు.
3శ్రద్ధగా విని నా దగ్గరకు రండి;
మీరు వింటే బ్రతుకుతారు.
నేను మీతో నిత్య నిబంధన చేస్తాను,
దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను.
4చూడండి, నేను అతన్ని జనాంగాలకు సాక్షిగా చేశాను,
జనాంగాలకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించాను.
5ఖచ్చితంగా నీకు తెలియని దేశాలను నీవు పిలుస్తావు.
యెహోవా నిన్ను మహిమపరచడం చూసి
నీ దేవుడైన యెహోవాను బట్టి
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి
నీవెవరో తెలియని దేశాలు నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాయి.
6యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి;
ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.
7దుష్టులు తమ మార్గాలను
అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి.
వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు.
మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.
8“నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు,
మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు”
అని యెహోవా చెప్తున్నారు.
9“ఆకాశాలు భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నాయో,
మీ మార్గాల కన్నా నా మార్గాలు
మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి.
10వర్షం మంచు ఆకాశం నుండి క్రిందికి వచ్చి
ఎలా తిరిగి వెళ్లకుండా భూమిని తడిపి
విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి
భూమిని తడిపి
విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి
అది చిగురించి ఫలించేలా చేస్తాయో,
11అలాగే నా నోటి నుండి వచ్చిన నా మాట ఉంటుంది:
అది వట్టిగా నా దగ్గరకు తిరిగి రాకుండా
నేను కోరుకున్న ప్రకారం చేసి
నేను దానిని పంపిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.
12మీరు సంతోషంగా బయటకు వెళ్తారు,
మీరు సమాధానంగా తీసుకెళ్తారు.
మీ ఎదుట పర్వతాలు కొండలు
పాటలు పాడడం ప్రారంభిస్తాయి,
పొలం లోని చెట్లన్నీ
తమ చేతులతో చప్పట్లు కొడతాయి.
13ముండ్ల చెట్లకు బదులు సరళ వృక్షాలు పెరుగుతాయి,
దురదగొండి చెట్లకు బదులు గొంజిచెట్లు ఎదుగుతాయి.
ఇది యెహోవా కీర్తిగా నిత్యమైన గుర్తుగా
ఎప్పటికీ నిలిచి ఉంటుంది.”

Currently Selected:

యెషయా 55: TSA

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in