యెషయా 50
50
ఇశ్రాయేలు పాపం, దాసుని విధేయత
1యెహోవా చెప్పే మాట ఇదే:
“నేను మీ తల్లిని విడిచిపెట్టి ఇచ్చిన
విడాకుల పత్రం ఎక్కడ?
నా అప్పుల వారిలో
ఎవరికి మిమ్మల్ని అమ్మివేశాను?
మీ పాపాలను బట్టి మీరు అమ్మబడ్డారు;
మీ అతిక్రమాలను బట్టి మీ తల్లి పంపివేయబడింది.
2నేను వచ్చినప్పుడు అక్కడ ఎందుకు ఎవరూ లేరు?
నేను పిలిచినప్పుడు ఎందుకు ఎవరూ జవాబివ్వలేదు?
నా చేయి నిన్ను విడిపించలేనంత చిన్నగా ఉందా?
నిన్ను రక్షించడానికి నాకు బలం లేదా?
కేవలం ఒక గద్దింపుతో నేను సముద్రం ఎండిపోయేలా చేస్తాను,
నదులను ఎడారిగా చేస్తాను;
నీళ్లు లేక వాటి చేపలు కుళ్ళిపోయి
దాహంతో చస్తాయి.
3ఆకాశాలకు చీకటి కమ్మేలా చేస్తాను
దానిని గోనెపట్టతో కప్పుతాను.”
4అలసినవారిని బలపరిచే మాటలు మాట్లాడడానికి
చక్కగా ఉపదేశించే నాలుకను ప్రభువైన యెహోవా నాకు ఇచ్చారు.
ఆయన ప్రతి ఉదయం నన్ను మేల్కొలుపుతారు,
శిష్యునిలా నేను శ్రద్ధగా వినేలా చేస్తారు.
5ప్రభువైన యెహోవా నా చెవులు తెరిచారు;
నేను తిరుగుబాటు చేయలేదు.
వినకుండా నేను వెనుతిరగలేదు.
6నన్ను కొట్టినవారికి నా వీపు అప్పగించాను,
నా గడ్డం పెరికినవారికి నా చెంపలు అప్పగించాను;
హేళన చేసిన వారి నుండి, ఉమ్మివేసిన వారి నుండి
నా ముఖం దాచుకోలేదు.
7ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు కాబట్టి
నేను సిగ్గుపరచబడను.
నేను సిగ్గుపరచబడనని నాకు తెలుసు
కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలా చేసుకున్నాను.
8నన్ను నీతిమంతునిగా ఎంచే వాడు సమీపంలోనే ఉన్నాడు.
నాపై ఎవరు అభియోగాలు మోగపలరు?
మనం కలిసి వాదించుకుందాం!
నా ప్రతివాది ఎవడు?
అతడు నన్ను ఎదిరించాలి!
9ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు.
నన్ను ఎవరు ఖండిస్తారు?
వారందరూ వస్త్రంలా పాతబడిపోతారు.
చిమ్మెటలు వారిని తినివేస్తాయి.
10మీలో యెహోవాకు భయపడి
ఆయన సేవకుని మాట వినే వారెవరు?
వెలుగు లేకుండా ఉంటూ
చీకటిలో నడిచేవాడు
యెహోవా నామాన్ని నమ్మి
తన దేవునిపై ఆధారపడాలి.
11అయితే ఇప్పుడు అగ్నిని ముట్టించి
మీ చుట్టూ మండుతున్న దివిటీలను పెట్టుకునే మీరందరు,
వెళ్లండి, మీ మంటల వెలుగులో నడవండి
మీరు వెలిగించిన దివిటీల మంటల్లో నడవండి.
నా చేతి నుండి మీరు పొందుకునేది ఇదే:
మీరు వేదనలో పడుకుంటారు.
Currently Selected:
యెషయా 50: TSA
Highlight
Copy
Compare
Share
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.