1 కొరింథీ పత్రిక 16
16
పరిశుద్ధుల కోసం కానుక సేకరించుట
1ప్రభువు ప్రజల కోసం కానుక పోగుచేయడం గురించి గలతీయలోని సంఘాలకు నేను ఏమి చేయమని చెప్పానో మీరు కూడా అది చేయాలి. 2ప్రతి వారంలో మొదటి రోజున మీలో ప్రతి ఒక్కరు మీ సంపాదన బట్టి కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి దాచి ఉంచండి. దానివల్ల నేను వచ్చినపుడు కానుకలు సేకరించాల్సిన అవసరం ఉండదు. 3నేను వచ్చిన తర్వాత, మీరు ఆమోదించిన వారికి నేను పరిచయ పత్రికలను ఇచ్చి, మీ కానుకలతో వారిని యెరూషలేముకు పంపుతాను. 4నేను కూడా వెళ్లడం అవసరం అయితే, వారు నా వెంట వస్తారు.
వ్యక్తిగత విజ్ఞాపనలు
5నేను మాసిదోనియాకు వెళ్లాలని అనుకుంటున్నాను కాబట్టి మాసిదోనియాకు వెళ్లినప్పుడు మీ దగ్గరకు వస్తాను. 6బహుశ మీతో కొంతకాలం గడుపుతాను లేదా చలికాలమంతా ఉంటాను. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి నా ప్రయాణంలో మీరు నాకు సహాయం చేయగలరు. 7మార్గమధ్యలో మిమ్మల్ని చూసి వెంటనే వెళ్లిపోవాలని నేను అనుకోవడం లేదు. ప్రభువు అనుమతిస్తే మీతో కొంతకాలం గడపాలని అనుకుంటున్నాను. 8అయితే పెంతెకొస్తు దినం వరకు ఎఫెసులోనే ఉంటాను. 9ఎందుకంటే చాలామంది నన్ను వ్యతిరేకించినా, ఫలవంతమైన పని చేయడానికి ఒక గొప్ప ద్వారం నాకు తెరవబడింది.
10తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిర్భయంగా ఉండేలా చూడండి. నాలాగే అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు. 11కాబట్టి ఎవరూ అతని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు. అతడు నా దగ్గరకు తిరిగి వచ్చేలా అతన్ని సమాధానంతో పంపించండి. అతడు సహోదరులతో పాటు వస్తాడని నేను ఎదురు చూస్తున్నాను.
12మన సహోదరుడైన అపొల్లో విషయం ఏంటంటే, సహోదరులతో పాటు మీ దగ్గరకు వెళ్లమని అతన్ని నేను చాలా బ్రతిమాలాను. కాని ఇప్పుడే బయలుదేరడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే సరియైన అవకాశం లభించినపుడు అతడు వస్తాడు.
13మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి. 14ప్రేమ పూర్వకంగా అన్ని పనులు చేయండి.
15స్తెఫెను అతని ఇంటివారు అకాయలో మొదటిగా క్రీస్తును స్వీకరించారని మీకు తెలుసు. వారు పరిశుద్ధుల సేవకు తమను తాము అర్పించుకున్నారు. సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, 16అలాంటి వారికి, వారితో పాటు పని చేసి సేవ చేసేవారికి మీరు లోబడి ఉండండి. 17స్తెఫెను, ఫొర్మూనాతు అకాయికు అనేవారు రావడం నాకు సంతోషం ఎందుకంటే మీరు లేని కొరత వారు నాకు తీర్చారు. 18నా ఆత్మకు, మీ ఆత్మకు కూడా వారు నూతన ఉత్తేజం కలిగించారు. అలాంటివారు గౌరవించదగినవారు.
చివరి అభినందనలు
19ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు తమ అభినందనలు పంపుతున్నారు.
అకుల, ప్రిస్కిల్ల అనేవారు, వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘం మీకు ప్రభువులో హృదయపూర్వక అభినందనలు పంపుతున్నారు.
20ఇక్కడి సహోదరీ సహోదరులందరు మీకు అభినందనలు పంపుతున్నారు.
పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకరు అభినందనలు తెలుపుకోండి.
21పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను.
22ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి!
23ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.
24క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్.
Currently Selected:
1 కొరింథీ పత్రిక 16: TSA
Highlight
Copy
Compare
Share
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.