YouVersion Logo
Search Icon

లూకా 10

10
యేసు తన డెబ్బది రెండు మంది శిష్యులను పంపటం
1ఆ తర్వాత యేసు మరొక డెబ్బది రెండు#10:1 డెబ్బది రెండు కొన్ని ప్రతులలో డెబ్బది అని ఉన్నది. మంది శిష్యులను నియమించాడు. వాళ్ళను జతలు జతలుగా తాను వెళ్ళబోయే ప్రతి గ్రామానికి, పల్లెకు తన కంటే ముందు పంపుతూ, 2“పంటబాగా పండింది. కాని పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువల్ల పంటనిచ్చిన ఆ ప్రభువును పని వాళ్ళను తన పొలాలకు పంపమని ప్రార్థించండి.
3“వెళ్ళండి! తోడేళ్ళ మందలోకి గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. 4మీ వెంటడబ్బు దాచుకొనే సంచి కాని, జోలి కాని, చెప్పులు కాని, తీసుకు వెళ్ళకండి. దారి మీద ఎవ్వరితో మాట్లాడకండి. 5ఒకరి యింట్లోకి వెళ్ళేముందు, మొదట సమాధానం కలుగుగాక అని చెప్పండి. 6ఆ యింటిలో శాంతి పొందనర్హుడైన వ్యక్తి ఉంటే మీ ఆశీస్సు అతనికి తోడౌతుంది. లేని పక్షంలో మీ ఆశీస్సు మీకు తిరిగివస్తుంది. 7ఉన్న యింట్లోనే ఉండండి. ఇచ్చిన దాన్ని భుజించండి. పని చేసినవానికి కూలి దొరకాలి కదా! ఇల్లిల్లు తిరగకండి.
8“ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగతమిచ్చి ఏది మీ ముందు పెడితే అది భుజించండి. 9గ్రామంలో ఉన్న రోగులకు నయం చెయ్యండి. వాళ్ళతో, ‘దేవుని రాజ్యం మీ దగ్గరకు వస్తోంది’ అని చెప్పండి.
10“మీరొక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగత మివ్వకుంటే 11వీధిలోకి వెళ్ళి మీరు చేస్తున్నది తప్పని సూచించటానికి, ‘మా కాలికంటిన మీ ఊరి ధూళి కూడా దులిపి వేస్తున్నాము. కాని యిది మాత్రం నిజం. దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది. తెలిసికోండి’ అని అనండి. 12తీర్పు చెప్పబోయేరోజున, ఆ ఊరి ప్రజల్ని దేవుడు సొదొమ ప్రజలకన్నా ఎక్కువగా శిక్షిస్తాడని నేను చెబుతున్నాను.
యేసు విశ్వసించనివారిని హెచ్చరించటం
(మత్తయి 11:20-24)
13“అయ్యో కొరాజీనా! అయ్యో బేత్సయిదా! మీకోసం చేసిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాలలో చేసివుంటే వాళ్ళు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకొని బూడిద తలపై వేసుకొని పశ్చాత్తాపం చెంది, మారుమనస్సు పొందివుండే వాళ్ళు. 14కాని తీర్పు చెప్పబడే రోజున తూరు, సీదోను ప్రజలకన్నా మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాడు. 15ఇక, ఓ కపెర్నహూమా! ఆకాశ మంత ఎత్తుగా హెచ్చించుకొందువా? పాతాళానికి త్రోసి వేయబడతావు.
16“మీ బోధనలు వింటే నా బోధనలు విన్నట్టే. మిమ్మల్ని నిరాకరిస్తే నన్నును నిరాకరించినట్టే. నన్ను నిరాకరిస్తే నన్ను పంపినవానిని నిరాకరించినట్లే” అని వాళ్ళతో అన్నాడు.
సాతాను పడిపోవటం
17ఆ డెబ్బది రెండు మంది శిష్యులు ఆనందంతో తిరిగి వచ్చి, “ప్రభూ! మీ పేరు చెప్పగానే దయ్యాలు కూడా మా మాటలకు లోబడ్డాయి” అని అన్నారు.
18యేసు, “సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడిపోవటం నేను చూశాను. 19పాముల మీద నడవటానికి మీకు అధికారము యిచ్చాను. శత్రువును జయించే అధికారం యిచ్చాను. ఏది మీకు హాని చెయ్యలేదు. 20దయ్యాలు మీ మాట వింటున్నంత మాత్రాన ఆనందించకండి. మీ పేరు పరలోకంలో వ్రాయబడినందుకు ఆనందించండి” అని అన్నాడు.
యేసు తండ్రిని ప్రార్థించటం
(మత్తయి 11:25-27; 13:16-17)
21ఆయన పవిత్రాత్మలో సంతోషిస్తూ, “ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి ఓ తండ్రి! నీకు స్తుతులు! నీవీ విషయాలు చదువుకున్న వాళ్ళనుండి, విజ్ఞానుల నుండి దాచి, అమాయకులకు తెలియ చేసావు. ఔను, తండ్రీ! ఇదే నీచిత్తము.
22“నా తండ్రి నాకు అన్నీ యిచ్చాడు. తండ్రికి తప్ప కుమారుడెవరో ఇతర్లకు తెలియదు. కుమారుడు చెప్పదలచిన వాళ్లకు తప్ప తండ్రి ఎవరో యితర్లకు తెలియదు” అని అన్నాడు.
23ఆ తర్వాత తన శిష్యుల వైపు తిరిగి, “మీరు చూస్తున్నవి చూసే కన్నులు ధన్యమైనవి. 24నేను చెప్పేదేమిటంటే మీరు చూస్తున్నవి చూడాలని చాలా మంది ప్రవక్తలు, రాజులు ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని వాళ్ళాశించారు. కాని వినలేక పోయారు” అని రహస్యంగా వారితో అన్నాడు.
మంచి సమరయుని ఉపమానం
25ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించాలనుకొని లేచి, “బోధకుడా! నేను నిత్యజీవం#10:25 నిత్యజీవం నిత్యజీవం అనగా మరణించిన తర్వాత శాశ్వతంగా దేవుని రాజ్యంలో జీవించుట (అనంత జీవం). పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
26దానికి యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసారు? నీవు ఏమిచదివావు?” అని అడిగాడు.
27అతడు, “‘నీ ప్రభువైనటువంటి దేవుణ్ణి సంపూర్ణమైన మనస్సుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితోనూ, శక్తితోనూ ప్రేమించు.’ అంతేకాక, ‘నిన్ను ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాళ్ళను ప్రేమించు’ అని వ్రాయబడివుంది” అని చెప్పాడు.
28యేసు ఈ విధంగా అన్నాడు: “నీవు సరియైన సమాధానం చెప్పావు. ఆ విధంగా నడుచుకో, అనంత జీవితం పొందుతావు.”
29ఆ పండితుడు తాను నీతిమంతుడనని రుజువు చేయటానికి యేసుతో, “మరి నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు.
30యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ దార్లో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతణ్ణి నిలువు దోపిడి చేసి బాగాకొట్టి వదిలి వేసారు. అతడు కొన ప్రాణంతో ఉన్నాడు.
31“అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిన రావటం తటస్థించింది. అతణ్ణి చూసి కూడా ఆ యాజకుడు ప్రక్కకు తొలిగి వెళ్ళిపొయ్యాడు. 32అదే విధంగా ఒక లేవీయుడు కూడా వచ్చి అతణ్ణి చూసి ప్రక్కకు తొలిగి వెళ్ళి పొయ్యాడు.
33“ఒక సమరయ ప్రాంతపువాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది. 34అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాలమీద ద్రాక్షారసం పోసి, నూనె రాచి, కట్లుకట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతణ్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. 35మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.”
36ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు.
37ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” అని సమాధానం చెప్పాడు.
దానికి యేసు, “నీవు కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు.
యేసు మార్త యింటికి వెళ్ళటం
38యేసు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో మార్త అనే స్త్రీ ఆయన్ని తన యింటికి ఆహ్వానించింది. 39ఆమెకు మరియ అనే ఒక సోదరి ఉంది. మరియ యేసు ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పిన విషయాలు వింటూ ఉంది. 40కాని మార్తకు పని ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కలిగింది. ఆమె యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరి యింటి పనులంతా నామీద వదిలి వేయటం మీకు న్యాయమనిపిస్తుందా? వచ్చి నాకు సహాయం చెయ్యమని ఆమెతో చెప్పండి” అని అన్నది.
41ప్రభువు, “మార్తా! మార్తా! పనులు ఎక్కువగా ఉండటంవల్ల నీకు చింత, చిరాకు కలుగుతున్నాయి. 42నిజంగా చెయ్యవలసింది ఒక్కటే పని. మరియ ఏది ఉత్తమమో దాన్ని ఎన్నుకొంది. దాన్ని ఆమెనుండి ఎవ్వరూ తీసుకోలేరు” అని అన్నాడు.

Currently Selected:

లూకా 10: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy