యోనా 1
1
దేవుని పిలుపు — యోనా పారిపోవుట
1అమిత్తయి కుమారుడైన యోనాతో#1:1 యోనా యోనా బహుశః 2 రాజులు 14:25లో పేర్కొనబడిన ప్రవక్తే కావచ్చు. యోహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా అన్నాడు: 2“నీనెవె#1:2 నీనెవె అష్షూరు ముఖ్య పట్టణం. అష్షూరు సైన్యం కీ.పూ. 723–721లో ఉత్తర ఇశ్రాయేలును నాశనం చేసింది. ఒక మహానగరం. అక్కడి ప్రజలు చేస్తున్న అనేక నీచ కార్యాలను గురించి నేను విన్నాను. కనుక నీవు ఆ నగరానికి వెళ్లి, వారు చేసే చెడు పనులు మానుకోమని చెప్పు.”
3దేవుని సలహా యోనా పాటించదలచలేదు. కనుక యెహోవాకు దూరంగా యోనా పారిపోవటానికి ప్రయత్నించాడు. యోనా యొప్పే#1:3 యొప్పే మధ్యధరా సముద్రం దగ్గర ఇశ్రాయేలు తీరంలో యొప్పే ఒక పట్టణం. పట్టణానికి వెళ్లాడు. బహుదూరానగల తర్షీషు#1:3 తర్షీషు బహుశః ఇది స్పెయిన్‌లో ఒక నగరం కావచ్చు. ఇది పడమరన ఉంది. యోనా పారిపోగలిగిన దూర ప్రాంతం. నీనెవె పట్టణం ఇశ్రాయేలుకు తూర్పున ఉన్నది. నగరానికి వెళ్లే ఒక ఓడను యోనా చూశాడు. యోనా తన ప్రయాణానికయ్యే ఖర్చు చెల్లించి ఓడలోనికి వెళ్లాడు. తర్షీషుకు వెళ్లే ఈ ఓడలోనున్న జనంతో కలిసి యోనా ప్రయాణం చేసి, యెహోవాకు దూరంగా పారిపోదలిచాడు.
పెనుతుఫాను
4కాని యెహోవా సముద్రంలో పెనుతుఫాను లేవదీశాడు. గాలివల్ల సముద్రం అల్లకల్లోలంగా అయింది. తుఫాను తీవ్రంగా రేగింది. ఓడ పగిలిపోవటానికి సిధ్ధమైంది. 5ఓడ మునగకుండా అందులో ఉన్నవారు దానిని తేలిక చేయదల్చారు. అందుచేత వారు సరుకును సముద్రంలో పారవేయడం మొదలుపెట్టారు. నావికులు చాలా భయపడ్డారు. ఓడలోనున్న ప్రతీవాడు తన దేవుని ప్రార్థించసాగాడు. యోనా మాత్రం పడుకోటానికి ఓడ క్రింది భాగంలోకి వెళ్లాడు.
యోనా నిద్రపోతూ ఉన్నాడు. 6ఓడ అధికారి యోనాను చూసి ఇలా అన్నాడు: “నిద్రలే! నీవు ఎందుకు నిద్రపోతున్నావు? నీ దేవుణ్ణి ప్రార్థించు! బహుశః నీ దైవం నీ ప్రార్థన ఆలకించి మనల్ని రక్షించవచ్చు.”
తుఫానుకు కారణం ఏమి?
7పిమ్మట ఓడలోని మనుష్యులు ఒకరితో ఒకరు, “మనకీ కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసు కోవటానికి మనం చీట్లు వేయాలి” అని అనుకున్నారు.
అందువల్ల వారు చీట్లు వేశారు. ఈ కష్టమంతా యోనా వల్ల వచ్చినదేనని చీట్లవల్ల తెలిసింది. 8అప్పుడు ఆ మనుష్యులు యోనాతో ఇలా అన్నారు: “మాకు ఈ కష్టమంతా నీ తప్పువల్లనే సంభవిస్తూ ఉంది! కనుక నీవు ఏమి చేశావో మాకు చెప్పు. నీవు ఏమి పని చేస్తావు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు? నీది ఏ దేశం? నీ ప్రజలు ఎవరు?”
9అప్పుడు యోనా ఇలా అన్నాడు: “నేనొక హెబ్రీయుణ్ణి (యూదా జాతివాణ్ణి). పరలోక దేవుడైన యెహోవాను నేను ఆరాధిస్తాను. సముద్రాన్ని, భూమిని సృష్టించిన దేవుడు ఆయనే.”
10తాను యెహోవానుండి పారిపోతున్నట్లు యోనా వారికి చెప్పాడు. ఇది తెలుసుకున్న ఆ మనుష్యులు చాలా భయపడిపోయారు. ఆ మనుష్యులు యోనాను, “నీ దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి భయంకరమైన అపరాధం చేశావు?” అని అడిగారు.
11గాలి, అలలు సముద్రంలో రానురాను మరింత తీవ్రమవుతున్నాయి. అందువల్ల ఆ మనుష్యులు యోనాతో, “మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే ఏమిచేయాలి? సముద్రాన్ని శాంతింపచేయటానికి నీకు మేము ఏమిచేయాలి?” అని అడిగారు.
12యోనా ఆ మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను తప్పు చేశానని నాకు తెలుసు. అందువల్లనే ఈ తుఫాను సముద్రంలో చెలరేగింది. కనుక నన్ను సముద్రంలోకి తోసివెయ్యండి. సముద్రం శాంతిస్తుంది”
13కాని ఆ మనుష్యులు యోనాను సముద్రంలోకి తోసివేయటానికి ఇష్టపడలేదు. వారు ఓడను తిరిగి ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కాని వారలా చేయలేకపోయారు. గాలి, సముద్రపు అలలు రాను రాను మరింత తీవ్రమయ్యాయి.
యోనాకు శిక్ష
14అందువల్ల ఆ మనుష్యులు యెహోవాకు ఇలా విన్నవించుకున్నారు: “ప్రభూ! ఇతడు చేసిన చెడు కార్యాల దృష్ట్యా మేము ఈ మనుష్యుని సముద్రంలోకి తోసి వేస్తున్నాము. ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరారోపణ దయచేసి మామీద వేయకు. మేము అతన్ని చంపినందుకు దయచేసి నీవు మమ్ముల్ని చనిపోయేలాగు చేయవద్దు. నీవు యెహోవావని మాకు తెలుసు. నీవు ఏది తలిస్తే అది చేస్తావు. కాని దయచేసి మాపట్ల కరుణ చూపు.”
15పిమ్మట వారు యోనాను సముద్రంలోకి విసరివేశారు. తుఫాను ఆగిపోయింది. సముద్రం శాంతించింది! 16ఆ మనుష్యులు ఇదంతా చూసి భయపడసాగారు. యెహోవాపట్ల వారికి భక్తి ఏర్పడింది. వారు యెహోవాకు ఒక బలి సమర్పించి, ప్రత్యేక మొక్కులు మొక్కుకొన్నారు.
17యోనా సముద్రంలో పడగానే యోనాను మింగటానికి ఒక పెద్ద చేపను యెహోవా పంపాడు. ఆ చేప కడుపులో యోనా మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉన్నాడు.
Currently Selected:
యోనా 1: TERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International