YouVersion Logo
Search Icon

న్యాయాధిపతులు 15

15
సమ్సోను ఫిలిష్తీయులకు కష్టాలు కలిగించుట
1గోధుమ పంట కోతల సమయంలో, సమ్సోను తన భార్యను చూడటానికి వెళ్లాడు. ఆమెకు కానుకగా ఒక పిల్ల మేకను తీసుకు వెళ్లాడు. అతను ఇలా అన్నాడు: “నేను నా భార్య గదికి వెళ్తున్నాను.”
2కాని ఆమె తండ్రి సమ్సోనుని లోపలికి వెళ్లనీయలేదు. ఆమె తండ్రి సమ్సోనుతో ఇలా అన్నాడు; “ఆమెను నీవు ద్వేషించినట్లు భావించాను. అందువల్లనే వివాహమునకు వచ్చిన తోడి పెండ్లి కుమారుడ్ని వివాహము చేసుకోమన్నాను. ఆమె చిన్న చెల్లెలు చాలా సౌందర్యవతి. ఆ చిన్న చెల్లెలిని తీసుకువెళ్లు”
3కాని సమ్సోను అతనితో ఇలా అన్నాడు; “మీ ఫిలిష్తీయులను బాధించేందుకు తగిన కారణం ఇప్పుడు నాకు కనిపించింది. ఇప్పుడు నన్నెవ్వరూ నిందించరు.”
4అందువల్ల సమ్సోను బయటికి వెళ్లి మూడు వందల నక్కల్ని పట్టుకున్నాడు. ఒకేసారి రెండేసి నక్కల్ని తీసుకుని వాటి తోకల్ని జతలు జతలుగా కట్టివేశాడు. ప్రతి రెండు నక్కల తోకలకు మధ్య ఒక దివిటీ కట్టి వేశాడు. 5తరువాత నక్కల తోకల మధ్య ఉన్న దివిటీలు వెలిగించాడు. ఆ తర్వాత ఫిలిష్తీయుల ధాన్యపు రాసుల గుండా నక్కల్ని పరుగెత్తనిచ్చాడు. ఆ విధంగా, అతను వారి పొలాలలో పెరిగిన మొక్కల్నీ, కోసిపెట్టిన ధాన్యపు రాసుల్నీ కాల్చివేశాడు. అతను వాళ్ల ద్రాక్ష తోటల్ని, వాళ్ల ఒలీవ చెట్లని కూడా కాల్చివేశాడు.
6“ఈ పని ఎవరు చేశారు?” అని ఫిలిష్తీయులు అడిగారు.
ఎవరో ఇలా చెప్పారు: “తిమ్నాతుకు చెందిన ఆ మనిషియొక్క అల్లుడైన సమ్సోను ఈ పనిచేశాడు. అతను ఈ విధంగా ఎందుకు చేశాడంటే, అతని మామగారు సమ్సోను భార్యని పెళ్లిలోని అతని స్నేహితునికి ఇచ్చివేశాడు.” అందువల్ల సమ్సోను భార్యనీ, ఆమె తండ్రినీ ఫిలిష్తీయులు కాల్చి వేశారు.
7అప్పుడు ఫిలిష్తీయులను ఉద్దేశించి సమ్సోను ఇలా అన్నాడు; “మీరు నాకు ఈ విధంగా కీడు చేశారు. అందువల్ల మీకు ఇప్పుడు నేను కీడు చేస్తాను. అప్పుడు నేను మీమీద పగతీర్చుకోవడం మానేస్తాను.”
8తర్వాత సమ్సోను ఫిలిష్తీయుల మీద దాడిచేశాడు. చాలా మందిని చంపివేశాడు. తర్వాత అతను వెళ్లి ఒక గుహలో నివసించెను. ఏతాము బండ అనే ప్రదేశంలో ఆ గుహ ఉన్నది.
9అప్పుడు ఫిలిష్తీయులు యూదా ప్రాంతానికి తరలిపోయారు. లేహీ అనే చోట వారు నిలిచారు. వారి సైనికులు అక్కడ విడిదిచేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. 10యూదా వంశానికి చెందిన మనుష్యులు వారిని ఇలా ప్రశ్నించారు: “ఫిలిష్తీయులైన మీరు మాతో యుద్ధం చేసేందుకు ఎందుకు ఇక్కడికి వచ్చారు?”
అందుకు వారు ఇలా అన్నారు: “మేము సమ్సోనును పట్టుకోడానికి వచ్చాము. అతనిని మేము మా బందీగా చేసుకోవడానికి వచ్చాము. అతను మా ప్రజలకి చేసిన పనులకు బదులుగా అతనిని శిక్షిస్తాము.”
11అప్పుడు యూదా వంశస్థులైన మూడువేల మంది మనుష్యులు సమ్సోనును పట్టుకొనుటకు ఏతాము బండకి దగ్గరగా వున్న ఆ గుహ వద్దకు వెళ్లి. అతనితో ఇలా అన్నారు: “నీవు మాకేమి చేశావు? ఫిలిష్తీయులు మమ్మల్ని పరిపాలిస్తున్నారని నీకు తెలియదా?”
“వారు నాకు చేసిన కీడుకు బదులుగా వారిని నేను శిక్షించాను.” అని సమ్సోను సమాధానం చెప్పాడు.
12అప్పుడు వారు సమ్సోనుతో ఇలా అన్నారు: “మేము నిన్ను బంధించడానికి వచ్చాము. మేము నిన్ను ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము.”
యూదా నుండి వచ్చిన మనుష్యులతో సమ్సోను ఇలా అన్నాడు: “మీరు నాకు ఏమీ అపకారం చేయమని నాకు మాట ఇవ్వాలి.”
13యూదా నుండి వచ్చిన మనుష్యులు ఇలా అన్నారు: “అందుకు మేము సమ్మతిస్తున్నాము. మేము నిన్ను బంధించి, ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము. మేము నిన్ను చంపమని మాట ఇస్తున్నాము.” అప్పుడు వారు రెండు కొత్త తాళ్లతో సమ్సోనును బంధించారు. ఆ ప్రాంతంలోని గుహనుంచి అతనిని తీసుకువెళ్లారు.
14లేహీ అనే చోటికి సమ్సోను రాగానే, ఫిలిష్తీయులు అతనిని కలుసుకోడానికి అక్కడికి వచ్చారు. సంతోషంతో వారు కేకలు వేశారు. అప్పుడు యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనును నింపగా, సమ్సోను తాళ్లు తెంపుకున్నాడు. కాలిపోయిన దారంవలె ఆ తాళ్లు బలహీనముగా కనిపించాయి. కరిగిపోయినట్లుగా ఆ తాళ్లు సడలిపోయాయి. 15సమ్సోను చచ్చిపోయిన ఒక గాడిద దవడ ఎముకను చూశాడు. అతను ఆ దవడ ఎముకను తీసుకున్నాడు. దానితో వేయి మంది ఫిలిష్తీయుల్ని చంపివేశాడు.
16తర్వాత సమ్సోను అన్నాడు:
“గాడిద దవడ ఎముకతో
వెయ్యి మందిని చంపాను!
గాడిద దవడ ఎముకతో
వారిని ఎత్తైన కుప్పగా పేర్చాను!”
17సమ్సోను ఈలాగు చెప్పిన తర్వాత, ఆ దవడ ఎముకను అతడు క్రిందికి విసరివేశాడు. అందువల్ల ఆ ప్రదేశానికి రామత్లేహీ#15:17 రామత్లేహీ దవడ కొండ అని దీని అర్థం. అనే పేరు వచ్చింది.
18సమ్సోనుకు బాగా దాహం వేసింది. అందువల్ల అతను యెహోవాను ఉద్దేశించి కేకపెట్టాడు. అతను అన్నాడు: “నేను నీ భక్తుడను. నీవు నాకు మహా విజయం సమకూర్చావు. ఇప్పుడు దప్పిక బాధతో నన్ను మరణం పాలుచేయవద్దు. సున్నతి కూడా చేసుకోని మనుష్యులకు నన్ను పట్టుబడకుండా చెయ్యి”
19లేహీలోని నేలలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం బద్దలయ్యేలా దేవుడు చేసెను. నీళ్లు వెలికి వచ్చాయి. ఆ నీటిని సమ్సోను తాగి, హాయిపొందాడు. అతను మళ్లీ బలవంతుడయ్యాడు. అందువల్ల అతను ఆ నీటి బుగ్గకి ఎన్ హకోరె#15:19 ఎన్ హకోరె అనగా పిలిచిన వాని ఊట అని అర్థం. అని పేరు పెట్టాడు. నేటికీ లేహీ నగరంలో అది ఉంది.
20ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను న్యాయాధిపతిగా ఇరవై సంవత్సరాలపాటు వ్యవహరించాడు. ఇది ఫిలిష్తీయులు నివసించిన కాలంలో జరిగింది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy