YouVersion Logo
Search Icon

యెషయా 2

2
యూదా, యెరూషలేముకు దేవుని సందేశం
1యెరూషలేము, యూదాలను గూర్చి ఆమోజు కూమారుడు యెషయా ఈ సందేశం చూశాడు.
2యెహోవా ఆలయం ఒక కొండమీద ఉంది.
చివరి రోజుల్లో ఆ కొండ, పర్వతాలన్నింటిలో ఎత్తయినదిగా చేయబడుతుంది.
ఆ పర్వతం కొండల శిఖరాలన్నింటికంటె ఎత్తు చేయబడుతుంది.
అన్ని రాజ్యాల ప్రజలూ అక్కడికి వెళ్తారు.
3అనేకమంది ప్రజలు అక్కడికి వెళ్తారు.
“మనం యెహోవా పర్వతానికి వెళ్దాం. యాకోబు దేవుని మందిరానికి మనం వెళ్లాలి.
అప్పుడు యెహోవా తన జీవన విధానం మనకు ఉపదేశిస్తాడు.
మనం ఆయనను వెంబడిస్తాం” అని వాళ్లు చెబుతారు.
దేవుని ఉపదేశాలు, యెహోవా సందేశం యెరూషలేములో, సీయోను కొండమీద ప్రారంభమై,
ప్రపంచం అంతటికీ వ్యాపిస్తుంది.
4అప్పుడు అన్ని రాజ్యాల ప్రజలకూ యెహోవా న్యాయాధిపతిగా ఉంటాడు.
అనేకుల వాదాలను దేవుడు అంతం చేస్తాడు.
ఆ మనుష్యులు తమ పోరాటానికి తమ ఆయుధాలు ఉపయోగించటం మానివేస్తారు.
వారు తమ ఖడ్గాలతో నాగటి నక్కులు చేస్తారు.
వారు, తమ ఈటెలను మొక్కలు కత్తిరించే పరికరాలుగా ప్రయోగిస్తారు.
ప్రజలు ప్రజలతో పోరాటం మానివేస్తారు.
ప్రజలు యుద్ధానికి మళ్లీ ఎన్నడూ శిక్షిణ పొందరు.
5యాకోబు వంశస్తులారా, మీరు యెహోవాను వెంబడించాలి.
6మీరు మీ ప్రజలను విడిచిపెట్టేశారు కనుక నేను మీతో దీనిని చెబుతున్నాను. తూర్పు దేశాల తప్పుడు అభిప్రాయాలతో మీ ప్రజలు నిండిపోయారు. ఫిలిష్తీయుల్లాగే మీ ప్రజలు జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించారు. ఆ వింత అభిప్రాయాలను మీ ప్రజలు పూర్తిగా స్వీకరించారు. 7ఇతర స్థలాలకు చెందిన వెండి బంగారాలతో మీ దేశం నిండిపోయింది. అక్కడ చాలా చాలా ఐశ్వర్యాలున్నాయి. మీ దేశం గుర్రాలతో నిండిపోయింది. అక్కడ ఎన్నెన్నో రథాలు ఉన్నాయి. 8ప్రజలు పూజించే విగ్రహాలతో మీ దేశం నిండిపోయింది. ప్రజలే చేసిన ఆ విగ్రహాలను ప్రజలు పూజిస్తారు. 9ప్రజలు మరింతగా చెడిపోయారు. ప్రజలు మరీ హీనస్థితికి దిగజారి పోయారు. దేవా, నిజంగా నీవు వాళ్లను క్షమించవు గదూ?
10వెళ్లి ధూళిలో, బండల చాటున దాక్కొనండి. యెహోవాను గూర్చి మీరు భయపడాలి. ఆయన మహా ప్రభావం నుండి మీరు దాక్కోవాలి.
11గర్విష్ఠులు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఆ గర్విష్ఠులు అవమానంతో నేలమీద సాగిలపడ్తారు. ఆ సమయంలో యెహోవా మాత్రమే ఇంకా ఉన్నతుడుగా నిలుస్తాడు.
12యెహోవా ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజు అహంకారులను, అతిశయం గలవారిని యెహోవా శిక్షిస్తాడు. అప్పుడు ఆ గర్విష్ఠులు ఎన్నికలేనివారుగా చేయబడతారు. 13గర్విష్ఠులైన ఆ మనుష్యులు లెబానోను కేదారు వృక్షాల్లా ఉంటారు. వారు బాషాను మహా మస్తకి వృక్షాల్లా ఉంటారు. కానీ ఆ మనుష్యులను దేవుడు శిక్షిస్తాడు. 14గర్విష్ఠులైన ఆ ప్రజలు ఎత్తయిన పర్వతాల్లా, కొండల్లా ఉన్నారు. 15ఆ గర్విష్ఠులు ఎత్తయిన గోపురాల్లా చాలా బలమైన గోడల్లా ఉన్నారు. కానీ ఆ ప్రజలను దేవుడు శిక్షిస్తాడు. 16ఆ గర్విష్ఠులు తర్షీషు గొప్ప ఓడల్లా ఉన్నారు. (ఈ ఓడలు చాలా విలువైన వస్తువులతో నిండి ఉంటాయి.) కానీ ఆ గర్విష్ఠులను దేవుడు శిక్షిస్తాడు.
17ఆ సమయంలో ప్రజలు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఇప్పుడు గర్వంగా ఉన్న మనుష్యులు నేలమీద సాగిలపడతారు. మరియు ఆ సమయంలో యెహోవా మాత్రమే ఉన్నతంగా నిలుస్తాడు. 18విగ్రహాలు (అబద్ధపు దేవతలు) అన్నీ తొలగి పోతాయి. 19బండల చాటున, నేల బీటల్లో మనుష్యులు దాక్కొంటారు. యెహోవాను గూర్చి ఆయన మహా ప్రభావం గూర్చి ప్రజలు భయపడ్తారు. ఇదంతా భూమిని గజగజ వణకించుటకు యెహోవా నిలబడినప్పుడు జరుగుతుంది.
20ఆ సమయంలో ప్రజలు వారి వెండి, బంగారు విగ్రహాలను పారవేస్తారు. (ప్రజలు పూజించుటకు మనుష్యులే ఆ విగ్రహాలను తయారు చేశారు.) ప్రజలు ఆ విగ్రహాలను నేలమీది కన్నాలలో ఉండే ఎలుకలకు, గబ్బిలాలకు వేస్తారు. 21అప్పుడు ప్రజలు బండ సందులలో దాక్కొంటారు. యెహోవాను గూర్చి, ఆయన మహా శక్తిని గూర్చి భయపడి వారు అలా చేస్తారు. భూమిని గజగజ వణికించుటకు యెహోవా నిలబడినప్పుడు ఇది జరుగుతుంది.
22మిమ్మల్ని రక్షించుట కోసం ఇతరులను నమ్ముకోవటం మీరు మానివేయాలి. వాళ్లూ మనుష్యులే, మనుష్యులు మరణిస్తారు. అందుచేత వాళ్లు కూడా దేవునిలా బలం గల వాళ్లు అని మీరు తలంచవద్దు.

Currently Selected:

యెషయా 2: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy