ఎస్తేరు 8
8
యూదులకు అనుకూలంగా మహారాజు శాసనం
1అదే రోజున అహష్వేరోషు మహారాజు యూదులకు శత్రువైన హామానుకు చెందిన చర స్థిరాస్తులున్నింటినీ ఎస్తేరు మహారాణికి దత్తం చేశాడు. మొర్దెకై తనకు బంధువన్న విషయాన్ని ఎస్తేరు మహారాజుకి చెప్పింది. అప్పుడు మొర్దెకై మహారాజు దర్శనానికి వచ్చాడు. 2మహారాజు తన రాజముద్రికను హామానునుంచి వెనక్కి తెప్పించి, తన వేలికి పెట్టుకున్నాడు. మహారాజు ఆ ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. అప్పుడింక ఎస్తేరు హామానుకి చెందిన ఆస్తులన్నింటి అజమాయిషీనీ మొర్దెకైకి అప్పగించింది.
3తర్వాత ఎస్తేరు మహారాజుతో మళ్లీ మాట్లాడింది. ఆమె రోదిస్తూ మహారాజు పాదాలపైపడి, అగాగీయుడైన హామాను దుష్ట పథకాన్ని రద్దు చేయవలసిందిగా మహారాజును వేడుకుంది. యూదులను హింసించేందుకు హామాను పన్నిన దుష్ట పథకం అది.
4మహారాజు తన బంగారు రాజదండంతో ఎస్తేరును తాకాడు. ఎస్తేరు లేచి, మహారాజు ముందు నిలబడింది. 5అప్పుడు ఎస్తేరు మహారాజుతో ఇలా విన్నవించుకుంది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, తమ దయవుంటే, నా కోసం ఇలా చెయ్యండి. ఇది మంచి ఊహ అనుకుంటేనే ఈ పని చేయండి. నేను తమకి ప్రీతిపాత్రురాలినైతే, హామాను పంపిన ఆజ్ఞను రద్దుచేస్తూ ఒక శాసనం చేయండి. అగాగీయుడైన హామాను మహారాజా వారి సామంత దేశాలన్నింటిలోని యూదులందరినీ సమూలంగా నాశనం చేయమని తాఖీదులు జారీచేశాడు. 6నా ప్రజలు ఇలాంటి ఘోరమైన విపత్తులకు గురికావడం నేను సహించలేను. నా కుటుంబ సభ్యులు హతమార్చబడటం నేను భరించలేను. అందుకే, మహారాజావారిని ఈ ఘోరాన్ని ఆపు చెయ్యవలసిందిగా అర్థిస్తున్నాను.”
7అహష్వేరోషు మహారాజు ఎస్తేరు మహారాణికీ, యూదుడైన మొర్దెకైకీ ఇలా సమాధానమిచ్చాడు, “హామాను యూదులకు శత్రువు కనుకనే వాని ఆస్తిని ఎస్తేరుకి ఇచ్చాను. నా సైనికులు వాడిని ఉరికంబానికెక్కించి, ఉరిదీశారు. 8ఇప్పుడిక మహారాజు ఆజ్ఞ మేరకు మరో ఆజ్ఞాపత్రం వ్రాయండి. మీకు సర్వోత్తమమని తోచిన పద్ధతిలో, యూదులకు తోడ్పడే విధంగా శాసనాన్ని వ్రాయండి. తర్వాత దానిమీద రాజముద్రికతో ముద్రవేసి మూసెయ్యండి. మహారాజు ఆజ్ఞ మేరకు వ్రాయబడి, దానిమీద రాజముద్రిక గుర్తువేయబడిన ఏ ఆధికారిక ఆజ్ఞాపత్రాన్ని రద్దుచేయ సాధ్యం కాదు.”
9మహారాజు వెంటనే లేఖకులను పిలువనంపించాడు. మూడవ నెల, అనగా సీవాను నెల 23వ రోజున యీ ఘటన జరిగింది. లేఖకులు మొర్దెకై ఆజ్ఞలన్నింటినీ వ్రాశారు. అవి యూదులకీ, సామంత రాజులకీ, రాజ్యాధిపతులకీ, 127 దేశాల అధికారులకీ పంపబడ్డాయి. ఆ దేశాలు భారత దేశంనుంచి ఇథియోపియాదాకా విస్తరించి వున్నాయి. ఆ ఆజ్ఞాపత్రాలు ఆయా దేశాల భాషల్లో వ్రాయబడ్డాయి. ఆవి ఆయా ప్రజాబృందాల భాషల్లోకి అనువదించబడ్డాయి. కాగా ఆ ఆజ్ఞాపత్రాలు యూదులకు వాళ్ల స్వంత భాషలో, స్వంతలిపిలో వ్రాయబడ్డాయి. 10మొర్దెకై ఆ ఆజ్ఞలను అహష్వేరోషు మహారాజు ఆమోదంతో వ్రాశాడు. తర్వాత అతను వాటిమీద రాజముద్రికతో ముద్ర వేయించాడు. అప్పుడిక, మొర్దెకై అశ్వారూఢులైన వార్తాహరుల ద్వారా వాటిని పంపించాడు. మహారాజు అశ్వశాలలోని గుర్రాలు అవి.
11ఆ లేఖల్లోని మహారాజు ఉత్తరువు ఇలా సాగింది: ప్రతి ఒక్క నగరంలోని యూదులూ తమ ప్రాణ రక్షణ కోసం ఒకచోట గుమిగూడేహక్కు కలిగున్నారు. తమ స్త్రీలపైనా, తమ బిడ్డలపైనా ఏ జాతీయులకు చెందిన ఏ సైన్యాన్నయినా సరే నాశనం చేసే, హత మార్చే, పూర్తిగా రూపు మాపే హక్కు వాళ్లకి వుంది. యూదులకు తమ శత్రువుల ఆస్తిని వశంచేసుకొనే హక్కూ, నాశనం చేసే హక్కూ వున్నాయి.
12యూదులకు ఈ హక్కు ఒక్క రోజే వుంటుంది. ఆ రోజు అదారు అనబడే 12వ నెల 13వ రోజు. అహష్వేరోషు సామ్రాజ్యంలోని దేశాలన్నింట్లోనూ యూదులకు హక్కు దాఖలు చేయబడింది. 13మహారాజు ఆజ్ఞాపత్రపు ప్రతి ఒకటి బయటికి పంపబడింది. అదొక శాసనం అయింది. అది అన్ని సామంత దేశాల్లోనూ శాసనం అయింది. సామ్రాజ్యంలో నివసించే ప్రతి ఒక జాతి ప్రజలకీ ఈ శాసనం చాటబడింది. యూదులు ప్రత్యేకమైన ఈ రోజున సర్వసన్నద్ధంగా ఉండేందుకు వీలుగా వాళ్లీపని చేశారు. యూదులు తమ శత్రువులకు బదులు దెబ్బ కొట్టేందుకు ఆ రోజున అనుమతింపబడతారు. 14వార్తాహరులు మహారాజావారి గుర్రాలమీద వేగంగా సాగిపోయారు. మహారాజు ఆ గుర్రాల రౌతులను వేగంగా వెళ్లమని ఆదేశించాడు. ఆ ఆజ్ఞ రాజధాని అయిన షూషను నగరానికి కూడా వర్తింప జేయబడింది.
15మొర్దెకై మహారాజు సమక్షం నుంచి బయల్దేరాడు. అతను మహారాజు సమర్పించిన నీలం, తెలుపు ప్రత్యేక దుస్తులు, ఒకపెద్ద బంగారు కిరీటం ధరించాడు. అతని పైవస్త్రం ఊదా రంగులో వుంది. అది చాలా మంచి ఉన్నితో నేసినది. ఆ రోజున షూషను నగరంలో ప్రత్యేకమైన ఒక ఉత్సవం జరుగుతోంది. 16అది యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది.
17మహారాజు ఆజ్ఞ చేరిన ప్రతి దేశంలోనూ, ప్రతి నగరంలోనూ, యూదుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. యూదులు విందులు, వేడుకలు చేసుకున్నారు. ఇతర జాతులకు చెందిన చాలామంది సామాన్య ప్రజలకు యూదులంటే భయంకలిగి, వాళ్లు యూదా మతం పుచ్చుకున్నారు.
Currently Selected:
ఎస్తేరు 8: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International