YouVersion Logo
Search Icon

2 దినవృత్తాంతములు 32

32
అష్షూరు రాజు హిజ్కియాను దుఃఖపెట్టుట
1హిజ్కియా ఈ పనులన్నీ విశ్వసనీయంగా చేసిన పిమ్మట, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా రాజ్యం మీదికి దండెత్తి వచ్చాడు. సన్హెరీబు అతని సైన్యంతో వచ్చి కోటలను మట్టడించి సైనిక స్థావరాలు ఏర్పాటు చేశాడు. అలా చేసి ఆ పట్టణాలను తాను జయించాలని అతడు పన్నాగం పన్నాడు. సన్హెరీబు ఆ పట్టణాలను తాను స్వయంగా గెలవాలని అనుకున్నాడు. 2యెరూషలేముపై దాడిచేయాటానికే సన్హెరీబు వచ్చాడని హిజ్కియాకు తెలుసు. 3అప్పుడు హిజ్కియా తన పరిపాలనాధికారులతోను, సైనికాధికారులతోను సంప్రదించాడు. వారు నగరం వెలుపల జలవనరుల నుండి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. పాలనాధికారులు, సైనికాధికారులు హిజ్కియాకు తోడ్పడ్డారు. 4అనేకమంది ప్రజలు కలిసి జలవనరులన్నీ ఆపివేశారు. దేశం మధ్యగా ప్రవహించే కాలువకు కూడ అడ్డకట్టలు వేశారు. “అష్షూరు రాజు ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి కావలసినంత నీరు ఇక్కడ దొరకదు” అని వారనుకున్నారు. 5హిజ్కియా యెరూషలేమును బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. అతడు చేసిన పని ఏమనగా: గోడలు పడిపోయిన చోటల్లా అతడు తిరిగి కట్టించాడు. అతడు గోడలమీద బురుజులు నిర్మింపజేసాడు. మొదటి గోడకు బయటగా మరో గోడను కూడ అతడు నిర్మించాడు. పాత యెరూషలేములో తూర్పు భాగాన అతడు మళ్లీ కోటలు నిర్మించాడు. అతడు అనేక ఆయుధాలను, డాళ్లను తయారు చేయించాడు. 6-7ప్రజలను నడిపించటానికి వారిపై సైనికాధికారులను నియమించాడు. నగర ద్వారం వద్ద బహిరంగ ప్రదేశంలో అతడీ అధికారులను కలుసుకొన్నాడు. హిజ్కియా ఆ అధికారులతో మాట్లాడి, వారిని ప్రోత్సహించాడు. వారితో అతడిలా అన్నాడు. “మీరు బలంగా, ధైర్యంగా వుండండి. భయపడకండి. అష్షూరు రాజు విషయంలోగాని, అతని మహా సైన్యం విషయంలోగాని మీరు కలత చెందవద్దు. అష్షూరు వారి బలం కంటే మనవద్ద మహాశక్తి సంపద వుంది. 8అష్షూరు రాజు వద్ద కేవలం మనుష్యల బలమే వుంది. కాని మనవద్ద యెహోవా దైవబలం వుంది. మన దేవుడు మనకు సహాయపడతాడు. మన యుద్ధాలు ఆయనే నిర్వహిస్తాడు!” ఆ విధంగా యూదా రాజైన హిజ్కియా ప్రజలను ఉత్సహపర్చి వారి ధైర్యాన్ని తట్టి లేపాడు.
9అష్షూరు రాజైన సన్హెరీబు, అతని సైన్యం లాకీషు నగరం దగ్గరగా స్థావరం ఏర్పాటు చేసి దానిని ఓడించాలని వున్నారు. పిమ్మట యూదా రాజైన హిజ్కియా వద్దకు, యెరూషలేములో వున్న యూదా ప్రజల వద్దకు సన్హెరీబు తన సేవకులను పంపాడు. సన్హెరీబు సేవకులు హిజ్కియాకు, యెరూషలేము ప్రజలకు వర్తమానాన్ని పట్టుకు వెళ్లారు.
10ఆ సేవకులు ఈ విధంగా ప్రకటించారు: “అష్షూరు రాజైన సన్హెరీబు యిలా చెప్పుచున్నాడు: యెరూషలేము ముట్టడిలో వుండగా మీరు దేనిని నమ్ముకొని ఇంకా అక్కడ వుంటున్నారు? 11హిజ్కియా మిమ్మల్ని మూర్ఖులనుగా చేస్తున్నాడు. యెరూషలేములోనే వుండి ఆకలి దప్పులతో మాడి చనిపోయే విధంగా మీరు మోసగింపబడుతున్నారు. ‘అష్షూరు రాజు నుండి మనల్ని మన ప్రభువైన యెహోవా రక్షిస్తాడు,’ అని హిజ్కియా మీకు చెప్పుచున్నాడు. 12హిజ్కియా తనకై తాను యెహోవా ఉన్నత స్థలాలను, బలిపీఠాలను తొలగించి వేశాడు. కాని యూదా, యెరూషలేము ప్రజలైన మీకు ఒకే బలిపీఠం మీద పూజచేసి, ధూపం వేయండని చెప్పుచున్నాడు. 13నిజానికి నేను, నా పూర్వీకులు ఇతర దేశాల ప్రజలకు ఏమి చేసినదీ మీయందరికీ తెలిసినదే. అన్యదేశాల దేవుళ్లు వారి ప్రజలను కాపాడలేక పోయారు. నేను వారి ప్రజలను నాశనం చేయకుండా ఆ దేవుళ్లు నన్ను ఆపలేకపోయారు. 14నా పూర్వీకులు ఆ రాజ్యలను నాశనం చేశారు. తన ప్రజలను నాశనం చేయకుండా నన్నాపగల దేవుడెవ్వడూ లేడు. కావున మీ దేవుడు నానుండి మిమ్మల్ని కాపాడగలడని మీరనుకుంటున్నారా? 15హిజ్కియా మిమ్మల్ని మూర్ఖులను చేయటంగాని, మోసపుచ్చటంగాని చేయనీయవద్దు. మీరతనిని నమ్మవద్దు. ఎందువల్లననగా ఏ దేశపు దేవుడే గాని, ఏ రాజ్యపు దేవుడేగాని అతని ప్రజలను నానుండి నా పూర్వీకుల నుండి సురక్షితంగా వుండేలా ఎన్నడూ కాపాడలేడు. కావున మీ దేవుడు మిమ్మల్ని నాశనం చేయకుండ నన్ను ఆపుతాడని మీరు అనుకోవద్దు.”
16ప్రభువగు యెహోవాకు, దేవుని సేవకుడగు హిజ్కియాకు వ్యతిరేకంగా అష్షూరు రాజు సేవకులు చాలా నీచంగా మాట్లడారు. 17ఇశ్రాయేలు దేవుడగు యెహోవాను అవమానపరుస్తూ అష్షూరు రాజు లేఖలు కూడ వ్రాశాడు. ఆ లేఖలలో అష్షూరు రాజు యిలా వ్రాశాడు: “నేను అన్యదేశాల ప్రజలను నాశనం చేసేటప్పుడు వారి దేవుళ్లు నన్నాపలేకపోయారు. అలాగే హిజ్కియా దేవుడు కూడ ఆయన ప్రజలను నాశనం చేయకుండ నన్ను ఆపలేడు.” 18తరువాత అష్షూరు రాజు సేవకులు నగర గోడమీద వున్న యెరూషలేము ప్రజలను చూసి కేకలు పెట్టి అరిచారు. గోడమీద జనాన్ని చూసి ఆ సేవకులు వారికి తెలిసేలా హెబ్రీ భాషలో తిట్టి అరిచారు. అష్షూరు రాజు సేవకులు యెరూషలేము ప్రజలను భయపెట్టేటందుకే అలా చేసారు. యెరూషలేము నగరాన్ని కైవసం చేసికోవాలనే వారలా చేసారు. 19ప్రపంచ దేశాల ప్రజలు పూజించే దేవుళ్లపట్ల కూడ ఆ సేవకులు చెడుగా మాట్లడారు. కాని ఆ దేవుళ్లు కేవలం మనుష్యులు తమ చేతులతో చేసిన బొమ్మలు. అదేరీతిలో ఆ సేవకులు యెరూషలేము దేవునిపట్ల కూడ నీచంగా మాట్లడారు.
20రాజైన హిజ్కియా మరియు ఆమోజు కుమారుడు. ప్రవక్తయునగు యెషయా ఈ సమస్య విషయంలో దేవుని ప్రార్థించారు. వారు ఆకాశంవైపు తిరిగి దేవునికి తమ గోడు కష్టాలు చెప్పుకున్నారు. 21అప్పుడు యెహోవా తన దూత నొకనిని అష్షూరు రాజు ఉండే స్థలానికి పంపించినాడు. ఆ దేవదూత అష్షూరు సైన్యంలోని అందరు సైనికులను, నాయకులను, అధికారులను చంపివేశాడు. దానితో అష్షూరు రాజు పలాయనం చిత్తగించి తన దేశంలోగల తన ఇంటికి పోయాడు. ప్రజలు అతనిని చూసి సిగ్గుపడ్డారు. అతడు తన దేవుని ఆలయానికి వెళ్లగా అక్కడ తన స్వంత కుమారులలో కొందరు అతనిని కత్తులతో నరికి చంపివేశారు. 22ఆ రకంగా యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అష్షూరు రాజైన సన్హెరీబు బారినుండి, ఇతర శత్రువుల బారినుండి రక్షించాడు. యెహోవా హిజ్కియాపట్ల యెరూషలేము ప్రజలపట్ల తగిన శ్రద్ధ తీసుకొన్నాడు. 23అనేక మంది ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని యెరూషలేముకు వచ్చారు. యూదా రాజైన హిజ్కియాకు కూడా వారు అనేక విలువైన వస్తువులు తెచ్చియిచ్చారు. అప్పటి నుండి హిజ్కియాను అన్ని దేశాల వారు గౌరవించటం మొదలు పెట్టారు.
24ఆ రోజులలోనే హిజ్కయాకు తీవ్రంగా జబ్బుచేసి చనిపోయే స్థితిలో వున్నాడు. అతడు దేవుని ప్రార్థించాడు. యెహోవా హిజ్కియాతో మాట్లాడి, అతనికి ఒక సూచన#32:24 సూచన హిజ్కియాకు సంబంధించిన కథ ప్రభువు అతనికి 15 సంవత్సరాల ఆయుష్షు పొడిగించిన విధము తెలియాటానికి చూడండి యెషయా 38:1-8. ఇచ్చినాడు. 25కాని హిజ్కియా హృదయం గర్విపడింది. అందువల్ల అతనికి దేవుడు చేసిన మేలుకు అతడు కృతజ్ఞతలు తెలుపలేదు. ఈ కారణంవల్ల దేవుడు హిజ్కియా పట్ల మరియు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించినాడు. 26కాని హిజ్కియా, యెరూషలేము ప్రజలు మళ్లీ మనస్సు మార్చుకొనినవారై, తమ జీవితాలు మార్చుకున్నారు. వారు విదేయులై గర్వించటం మానుకున్నారు. అందువల్ల హిజ్కియా బ్రతికినంత కాలం దేవుని కోపం వారి మీదికి రాలేదు.
27హిజ్కియా మహా భాగ్యవంతుడయ్యాడు. గొప్ప గౌరవం లభించింది. వెండి బంగారాలు, విలువైన ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్లు, తదితర వస్తువులు భద్రపర్చటానికి అతడు తగిన స్థానాలు ఏర్పాటు చేశాడు. 28ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం, ప్రజలు తనకు పంపిన నూనెను నిల్వచేయటానికి హిజ్కియా గిడ్డంగులు నిర్మించాడు. అన్ని రకాల పశువులశాలలు, గొఱ్ఱెలకు కొట్టములు కూడ నిర్మించాడు. 29హిజ్కియా చాలా కొత్త పట్టణాలు నిర్మించాడు. పశుసంపద గొఱ్ఱెల మందలు ఎక్కువగా అభివృద్ధి చేశాడు. యెహోవా హిజ్కియాకు లెక్కలేనంత ఐశ్వర్యాన్ని సమకూర్చినాడు. 30యెరూషలేములో గిహోను ఎగువ కాలువ ప్రవాహానికి అడ్డుకట్టలు వేసి, నీటిని దావీదు నగరంలో పడమటి దిశన తిన్నగా ప్రవహించేలా మళ్లించినవాడు హిజ్కియాయే. హిజ్కియా చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధించాడు.
31ఒక పర్యాయం బబులోను పెద్దలు హిజ్కియా వద్దకు దూతలను పంపారు. అప్పుడు దేశాలలో సంభవించిన ఒక అధ్బుత సంఘటన#32:31 సంఘటన యెషయా 38:1-8 చూడండి. గురించి అడిగి తెలిసికొన్నారు. వారు వచ్చినప్పుడు హిజ్కియా మనస్సులో#32:31 మనస్సులో చూడండి 2 రాజులు 20:12-19. ఏమున్నదో పరీక్షించి పూర్తిగా తెలిసికొనటానికి అతనిని యెహోవా ఒంటరిగా వదిలినాడు.
32హిజ్కియా పాలనలో అతడు చేసిన ఇతర కార్యములను గురించి, అతని భక్తి కార్యక్రమాల గురించి యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథం మరియు ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా దర్శనాలలో వ్రాయబడినాయి. 33హిజ్కియా చనిపోగా అతడు తన పూర్వీకుల వద్ద సమాధి చేయబడినాడు. దావీదు పూర్వీకుల సమాధులున్న కొండమీద ప్రజలు హిజ్కియాను సమాధి చేశారు. హిజ్కియా చనిపోయినప్పుడు యూదా ప్రజలందరు, మరియు యెరూషలేములో నివసిస్తున్నవారు అతనికి ఘనంగా నివాళులర్పించారు. హిజ్కియా స్థానంలో మనష్షే కొత్త రాజయ్యాడు. మనష్షే హిజ్కియా కుమారుడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy