YouVersion Logo
Search Icon

కీర్తన 103

103
దావీదు కీర్తన.
1నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.
2నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.
3ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.
4నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.
5నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.
6యెహోవా న్యాయమైన దాన్ని జరిగిస్తాడు. అణగారిన వారందరికీ న్యాయం చేస్తాడు.
7ఆయన మోషేకు తన విధానాలూ ఇశ్రాయేలు వంశస్థులకు తన కార్యాలూ తెలియచేశాడు.
8యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.
9ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు.
10మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.
11భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.
12పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.
13తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.
14మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.
15మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు.
16దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.
17యెహోవాను గౌరవించే వారి పట్ల ఆయన కృప తరతరాలకూ ఉంటుంది. ఆయన నీతి వారి వారసులకు కొనసాగుతుంది.
18వాళ్ళు ఆయన నిబంధన పాటిస్తారు. ఆయన ఆదేశాలను మనసులో ఉంచుకుంటారు.
19యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది.
20యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.
21యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.
22యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in