YouVersion Logo
Search Icon

కీర్తన 102

102
బాధితుడి ప్రార్థన, దుఃఖంలో సోలిపోయి యెహోవా సన్నిధిలో పెట్టిన మొర.
1యెహోవా, నా ప్రార్థన విను, నా మొర నీకు చేరనివ్వు.
2నా కష్టసమయాన నీ ముఖం నాకు దాచవద్దు. నా మాట విను. నేను నిన్ను పిలిచినప్పుడు వెంటనే నాకు జవాబివ్వు.
3పొగ లాగా నా రోజులు గతించిపోతున్నాయి. నా ఎముకలు కాలిపోతున్నట్టు ఉన్నాయి.
4నా గుండె కుంగిపోయింది. నేను వాడిన గడ్డి పరకలాగా ఉన్నాను. నేనేమీ తినలేక పోతున్నాను.
5నేను ఆపకుండా మూలుగుతూ ఉండడం వలన చాలా చిక్కిపోయాను.
6నేను అడవి గూడబాతులాంటి వాణ్ణి. పాడుబడిపోయిన చోట్ల ఉండే గుడ్లగూబలాంటి వాణ్ణి.
7ఇంటిమీద ఏకాకిగా కూర్చున్న ఒంటరి పిట్టలాగా రాత్రంతా మెలకువగా ఉన్నాను.
8రోజంతా నా విరోధులు నా మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నన్ను నిందించేవాళ్ళు నా పేరు ఎత్తి శపిస్తారు.
9బూడిదను అన్నం లాగా తింటున్నాను. కన్నీళ్ళతో కలిపి నీళ్ళు తాగుతున్నాను.
10నీ కోపాగ్నిని బట్టి నువ్వు నన్ను పైకెత్తి అవతల పారేశావు.
11నా రోజులు అదృశ్యమయ్యే నీడలా ఉన్నాయి, గడ్డిలాగా నేను వాడిపోయాను.
12అయితే యెహోవా, నువ్వు శాశ్వతంగా ఉంటావు. నీ కీర్తి తరతరాలుంటుంది.
13నువ్వు లేచి సీయోనును కనికరిస్తావు. దానిమీద దయ చూపడానికి సరైన సమయం వచ్చింది.
14దాని రాళ్లంటే నీ సేవకులకు ఎంతో ఇష్టం. దాని శిథిలాల దుమ్ము అంటే వారికి వాత్సల్యం.
15యెహోవా, రాజ్యాలు నీ నామాన్ని గౌరవిస్తాయి, ప్రపంచ రాజులంతా నీ గొప్పదనాన్ని గౌరవిస్తారు.
16యెహోవా సీయోనును తిరిగి కట్టిస్తాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమవుతాడు.
17అప్పుడు ఆయన దిక్కులేని వాళ్ళ ప్రార్థనకు స్పందిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆయన నిరాకరించడు.
18రాబోయే తరాలకు ఇది రాసి పెట్టి ఉంటుంది, ఇంకా పుట్టని ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
19బందీల మూలుగులు వినడానికీ చావు ఖరారైన వాళ్ళను విడిపించడానికీ,
20యెహోవా ఉన్నతమైన పవిత్ర స్థలం నుంచి కిందికి చూశాడు, పరలోకం నుంచి భూమిని చూశాడు.
21యెహోవాను సేవించడానికి రాజ్యాలూ ప్రజలూ సమకూడినప్పుడు,
22మనుషులు యెహోవా నామాన్ని సీయోనులో ప్రకటిస్తారు. యెరూషలేములో ఆయన కీర్తిని ప్రకటిస్తారు.
23ఆయన నా యవ్వనంలో నా బలం తీసేశాడు. నా రోజులు తగ్గించేసాడు.
24నేనిలా అన్నాను, నా దేవా, నడివయస్సులో నన్ను తీసి వేయవద్దు. నువ్వు తరతరాలూ ఇక్కడ ఉన్నావు.
25పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే.
26అవి అంతరించిపోతాయి. కానీ నువ్వు నిలిచి ఉంటావు. అవన్నీ బట్టల్లాగా పాతవై పోతాయి. నువ్వు వాటిని దుస్తుల్లాగా మార్చి వేస్తావు. అవి ఇక కనబడవు.
27అయితే నువ్వు అలానే ఉన్నావు, నీ సంవత్సరాలకు అంతం లేదు.
28నీ సేవకుల పిల్లలు నిలిచి ఉంటారు. వారి వంశస్థులు నీ సన్నిధిలో జీవిస్తారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in