YouVersion Logo
Search Icon

రోమా 1

1
1యేసు క్రీస్తు#1:1 క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. దాసుడును, అపొస్తలుడుగా నుండు టకు పిలువబడినవాడును, 2-7దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయనద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.
8మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 9-10ఇప్పుడేలాగైనను ఆటంకములేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మునుగూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. 11మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని 12ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. 13సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిదివరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు 14గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను. 15కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. 16సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. 17ఎందుకనిన–నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.
18దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. 19ఎందు కనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. 20ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. 21మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. 22వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 23వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.
24ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశ లను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 25అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్.
26అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. 27అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి.
28మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. 29అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 30కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును 31మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 32ఇట్టి కార్యములను అభ్య సించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.

Currently Selected:

రోమా 1: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy