YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 28

28
1మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి. 2అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతకాదు. ఏలాగనగా, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందునవారు నిప్పురాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి. 3అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. 4ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలా డుట చూచినప్పుడు–నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని#28:4 లేక, ధర్మదేవత. బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనిరి. 5అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు. 6వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభి ప్రాయము మాని–ఇతడొక దేవత అని చెప్పసాగిరి.
7పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడుదినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను. 8అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొని యుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థనచేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను. 9ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడ వచ్చి స్వస్థత పొందిరి. 10మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి.
11మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపమందు శీతకాల మంతయు గడపిన అశ్వినీ చిహ్నముగల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి 12సురకూసైకి వచ్చి అక్కడ మూడుదినములుంటిమి. 13అక్కడనుండి చుట్టు తిరిగి రేగియుకు వచ్చి యొక దినమైన తరువాత దక్షిణపు గాలి విసరుటవలన మరునాడు పొతియొలీకి వచ్చితిమి. 14అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. 15అక్కడనుండి సహోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకును త్రిసత్రములవరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.
16మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి యున్న సైనికులతోకూడ ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను.
17మూడుదినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడతడు–సహోదరులారా, నేను మన ప్రజల కైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను, యెరూషలేములోనుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. 18వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని 19యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునన వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనముమీద నేరమేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు; 20ఈ హేతువుచేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని; ఇశ్రాయేలుయొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను. 21అందుకు వారు–యూదయనుండి నిన్నుగూర్చి పత్రికలు మాకు రాలేదు; ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్క డైనను నిన్నుగూర్చి చెడుసంగతి ఏదియు మాకు తెలియ పరచను లేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు. 22అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన విన గోరుచున్నాము; ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియుననిరి. 23అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.
24అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. 25వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా.
26–మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే
గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని
కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి
చెప్పుము.
27ఈ ప్రజలు కన్నులార చూచి చెవు
లార విని మనసార గ్రహించి నావైపు తిరిగి
నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృద
యము క్రొవ్వియున్నది. వారు చెవులతో మంద
ముగా విని కన్నులు మూసికొనియున్నారు
అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీపితరులతో చెప్పిన మాట సరియే. 28-29కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురుగాక, వారు దాని విందురు.#28:28-29 కొన్ని ప్రాచీన ప్రతులలో–అతడీ సంగతులు చెప్పిన తరువాత యూదులు తమలోతాము చాల తర్కించుకొని వెళ్లిపోయిరి, అని 29వ వచనము కూర్చబడియున్నది.
30పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి 31ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy