YouVersion Logo
Search Icon

ఫిలిప్పీయులకు 4:4-19

ఫిలిప్పీయులకు 4:4-19 TELUBSI

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి. మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై యుండును. నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును. ఏలయనగా థెస్సలొనీకలో కూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పు చున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగ మునై యున్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవ సరమును తీర్చును.