YouVersion Logo
Search Icon

ఫిలిప్పీయులకు 1:3-17

ఫిలిప్పీయులకు 1:3-17 TELUBSI

మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేనుచేయు ప్రతి ప్రార్థ నలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకములయందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేప్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను. ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేన లోని వారికందరికిని తక్కినవారికందరికిని స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతోకూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు; వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడియున్నాననియెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు.