సంఖ్యాకాండము 23
23
1అప్పుడు బిలాము–ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. 2బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి. 3మరియు బిలాము బాలాకుతో–బలిపీఠము మీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొను నేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్ట యెక్కెను. 4దేవుడు బిలాముకు ప్రత్యక్షముకాగా అతడు–నేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దానిమీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా, 5యెహోవా ఒకమాట బిలాము నోట ఉంచి–నీవు బాలాకునొద్దకు తిరిగివెళ్లి యిట్లు చెప్పుమనెను. 6అతడు బాలాకునొద్దకు తిరిగివెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచియుండెను. 7అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను –
అరామునుండి బాలాకు
తూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్ను రప్పించి
–రమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము
రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.
8ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే
ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.
9మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను
కొండలనుండి అతని కనుగొనుచున్నాను
ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును
జనములలో లెక్కింపబడరు.
10యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?
ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్ట గలరు?
నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక.
నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.
11అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. 12అందుకతడు– యెహోవా నా నోట ఉంచినదాని నేను శ్రద్ధగా పలుక వద్దా? అని ఉత్తరమిచ్చెను. 13అప్పుడు బాలాకు–దయచేసి నాతోకూడ మరియొక చోటికి రమ్ము. అక్కడనుండి వారిని చూడవచ్చును; వారి చివరమాత్రమే కనబడునుగాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి 14పిస్గా కొన నున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. 15అతడు–నీవు ఇక్కడ నీ దహనబలియొద్ద నిలిచియుండుము; నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, 16యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి–నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను. 17అతడు బాలాకు నొద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలియొద్ద నిలిచియుండెను. మోయాబు అధికారులును అతనియొద్ద నుండిరి. బాలాకు –యెహోవా యేమి చెప్పెనని అడుగగా 18బిలాము ఉపమానరీతిగా నిట్లనెను–
బాలాకూ, లేచి వినుము
సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము.
19దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు
పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు
ఆయన చెప్పి చేయకుండునా?
ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
20ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను
ఆయన దీవించెను; నేను దాని మార్చలేను.
21ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు
ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు
అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.
22రాజుయొక్క జయధ్వని వారిలో నున్నది
దేవుడు ఐగుప్తులోనుండి వారిని రప్పించెను
గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు.
23నిజముగా యాకోబులో మంత్రము లేదు
ఇశ్రాయేలులో శకునము లేదు
ఆయాకాలములందు దేవుని కార్యములు
యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియ చెప్పబడును.
24ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును
అది సింహమువలె నిక్కి నిలుచును
అది వేటనుతిని చంపబడిన వాటి రక్తము త్రాగు
వరకు పండుకొనదు.
25అంతట బాలాకు–నీవు ఏ మాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా 26బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా? అని బాలాకుకు ఉత్తరమియ్యగా 27బాలాకు నీవు దయచేసి రమ్ము; నేను వేరొకచోటికి నిన్ను తోడుకొని పోయెదను; అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవునిదృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను. 28బాలాకు ఎడారికి ఎదురుగా నున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొనిపోయిన తరువాత 29బిలాము–ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి, యిక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. 30బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.
Currently Selected:
సంఖ్యాకాండము 23: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.