YouVersion Logo
Search Icon

సంఖ్యాకాండము 1

1
1వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవనెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను 2–ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము. 3ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమతమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. 4మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతోకూడ ఉండవలెను. 5మీతోకూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా–రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు; 6షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు 7యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను 8ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు 9జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు 10యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు 11బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను 12దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు 13ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు 14గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు 15నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి. 16వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమతమపితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును. 17పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకొని రెండవనెల మొదటి తేదిని సర్వసమాజమును కూర్చెను. 18ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమతమ వంశావళులనుబట్టి తమతమ వంశములను తమతమపితరుల కుటుంబములను తమతమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా 19యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను.
20ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది యైరి.
21-22షిమ్యోను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా 23షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.
24గాదు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా 25గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
26యూదా పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా 27యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.
28ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా 29ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడినవారు ఏబది నాలుగువేల నాలుగువందలమంది యైరి.
30జెబూలూను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా 31జెబూలూను గోత్రములో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగువందలమంది యైరి.
32యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా 33యోసేపు గోత్రములో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది యైరి.
34మనష్షే పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా 35మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.
36బెన్యామీను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా 37బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది యైదువేల నాలుగువందలమంది యైరి.
38దాను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా 39దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందలమంది యైరి.
40ఆషేరు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా 41ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.
42నఫ్తాలి పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా 43నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.
44వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహరోనును తమతమపితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించినవారు. 45అట్లు ఇశ్రాయేలీయులలో తమతమపితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలీయులందరు 46లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.
47అయితే లేవీయులు తమపితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. 48ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను –నీవు లేవీగోత్రమును లెక్కింపకూడదు. 49ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. 50నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటిమీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవచేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు. 51మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించినయెడలవాడు మరణశిక్ష నొందును. 52ఇశ్రాయేలీయులు తమతమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను. 53ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. 54యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy