YouVersion Logo
Search Icon

లేవీయకాండము 27

27
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 2–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పునవారు యెహోవాకు దాని చెల్లింపవలెను. 3నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సువరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను. 4ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను. 5అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను. 6ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. 7అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను. 8ఒకడు నీవు నిర్ణయించినవెలను చెల్లింపలేనంత బీదవాడైనయెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.
9యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. 10అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చి నదియు ప్రతిష్ఠితమగును. 11జనులు యెహోవాకు అర్పింప కూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను. 12అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. 13అయితే ఒకడు అట్టిదానిని విడిపింప గోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను.
14ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినయెడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. 15తన యిల్లు ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును.
16ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినయెడల దానిలో చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది. 17అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము. 18సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను. 19పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును. 20అతడు ఆ పొలమును విడిపింపనియెడలను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు. 21ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును. 22ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల 23యాజకుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను. 24సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను. 25నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.
26అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱెమేకల మందలోనిదైననేమి యెహోవాదగును. 27అది అపవిత్రజంతువైనయెడలవాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింప వచ్చును. దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను.
28అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించినయెడల ప్రతిష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపనుకూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. 29మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను.
30భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. 31ఒకడు తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనను విడిపింప గోరినయెడల దానిలో అయిదవ వంతును దానితో కలుపవలెను. 32గోవులలోనేగాని గొఱ్ఱెమేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును. 33అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చినయెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింప కూడ దని చెప్పుము.
34ఇవి యెహోవా సీనాయికొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy