YouVersion Logo
Search Icon

మార్కు 8

8
1ఆ దినములలో మరియొక సారి బహుజనులు కూడి రాగా, వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తనయొద్దకు పిలిచి 2–జనులు నేటికి మూడుదినముల నుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను; 3నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను. 4అందు కాయన శిష్యులు–ఈ అరణ్యప్రదేశములో ఒక డెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి. 5ఆయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు – ఏడనిరి. 6అప్పుడాయన – నేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి. 7కొన్ని చిన్నచేపలు కూడ వారియొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడ వడ్డించుడని చెప్పెను. 8వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి. 9భోజనముచేసినవారు ఇంచు మించు నాలుగు వేలమంది. వారిని పంపివేసిన వెంటనే 10ఆయన తన శిష్యులతోకూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను.
11అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి. 12ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి–ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి 13వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను.
14వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను. 15ఆయన–చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా 16వారు–తమయొద్ద రొట్టెలు లేవేయని తమలోతాము ఆలోచించుకొనిరి. 17యేసు అది యెరిగి మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా? 18మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా? 19నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టి నప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారు–పండ్రెండని ఆయనతో చెప్పిరి. 20ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు – ఏడనిరి. 21అందుకాయన – మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను.
22అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. 23ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొనిపోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి–నీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా, 24వాడు కన్నులెత్తి – మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. 25అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను. 26అప్పుడు యేసు–నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను.
27యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా– నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల నడిగెను. 28అందుకు వారు–కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. 29అందుకాయన–మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు–నీవు క్రీస్తు#8:29 క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడు అని అర్థము.వని ఆయనతో చెప్పెను. 30అప్పుడు తన్నుగూర్చిన యీ సంగతి ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. 31మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడుదినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను. 32ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయిపట్టుకొని ఆయనను గద్దింపసాగెను 33అందుకాయన తన శిష్యులవైపు తిరిగి, వారిని చూచి–సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్క రింపకున్నావని పేతురును గద్దించెను.
34అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి–నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబ డింపవలెను. 35తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించు కొనును. 36ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? 37మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్య గలుగును? 38వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్నుగూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధదూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy