YouVersion Logo
Search Icon

మార్కు 2

2
1కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను 2ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా 3కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 4చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి. 5యేసు వారి విశ్వాసము చూచి–కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను. 6శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. 7వారు–ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. 8వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని – మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? 9ఈ పక్షవాయువుగలవానితో – నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా? 10అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి 11పక్ష వాయువు గలవానిని చూచి–నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. 12తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
13ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. 14ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి –నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను. 15అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి యుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబ డించువారైరి. 16పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి–ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనముచేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా 17యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
18యోహాను శిష్యులును పరిసయ్యులును ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి–యోహాను శిష్యులును పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయన నడుగగా 19యేసు–పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయ దగునా? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని 20పెండ్లికుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలోనే వారుపవాసము చేతురు. 21ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు; వేసినయెడల ఆ క్రొత్తమాసిక పాతబట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. 22ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను.
23మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు– వెన్నులు త్రుంచుచునుండిరి. 24అందుకు పరిసయ్యులు–చూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయుచున్నారని ఆయన నడిగిరి. 25అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా? 26అబ్యాతారు ప్రధానయాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులేగాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, తనతోకూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను. 27మరియు–విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు. 28అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy