YouVersion Logo
Search Icon

మత్తయి 28

28
1విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. 2ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. 3ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. 4అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. 5దూత ఆ స్ర్తిలను చూచి–మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; 6ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి 7త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను. 8వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా 9యేసు వారిని ఎదుర్కొని–మీకు శుభమని చెప్పెను. వారు ఆయనయొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా 10యేసు–భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను.
11వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధానయాజకులతో చెప్పిరి. 12కాబట్టి వారు పెద్దలతోకూడి వచ్చి ఆలోచనచేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి 13– మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి; 14ఇది అధిపతి చెవినిబడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి. 15అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.
16పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. 17వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి. 18అయితే యేసు వారియొద్దకు వచ్చి–పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. 19కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు 20నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy