YouVersion Logo
Search Icon

మత్తయి 17

17
1ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. 2ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. 3ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. 4అప్పుడు పేతురు – ప్రభువా, మన మిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. 5అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. 6శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా 7యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. 8వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
9వారు కొండ దిగి వచ్చుచుండగా–మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడని యేసు వారికాజ్ఞాపించెను. 10అప్పు డాయన శిష్యులు ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి. 11అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టు నను మాట నిజమే; 12అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పు చున్నాననెను. 13అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహా నునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.
14వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని– 15ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు; 16నీ శిష్యుల యొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. 17అందుకు యేసు–విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను. 18అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెను; ఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. 19తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి–మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతి మని అడిగిరి. 20-21అందుకాయన–మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి–ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
22వారు గలిలయలో సంచరించుచుండగా యేసు–మనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు, 23వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి.
24వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి– మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడుగగా–చెల్లించుననెను. 25అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తి సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన్యుల యొద్దనా? అని అడిగెను. 26అతడు–అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. 27అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy