YouVersion Logo
Search Icon

మలాకీ 2

2
1కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడి యున్నది. 2సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీరు ఆయాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాదఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకుమునుపే నేను వాటిని శపించి యుంటిని. 3మిమ్మునుబట్టి విత్తనములు చెరిపి వేతును, మీ ముఖములమీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు 4అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీ కిచ్చినవాడను నేనేయని మీరు తెలిసికొందు రని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 5నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై 6సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి. 7యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవాదూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను. 8అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి, లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసియున్నారు. 9నా మార్గములను అనుస రింపక ధర్మశాస్త్రమునుబట్టి విమర్శించుటలో మీరు పక్ష పాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగినవారినిగాను నీచులనుగాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
10మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహముచేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? 11యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయులమధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి; యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి. 12యాకోబు సంతతివారి డేరాలలోనుండి మేల్కొలుపు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. 13మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు; యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీచేత తీసికొనకయు నున్నాడు. 14అది ఎందుకని మీ రడుగగా, యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. 15కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. 16భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి.
17మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుచున్నారే. –దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోషపడును; లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పుకొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.

Currently Selected:

మలాకీ 2: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy