YouVersion Logo
Search Icon

యెహోషువ 14

14
1ఇశ్రాయేలీయులు కనానుదేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. 2మోషేద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులును చీట్లు వేసి, తొమ్మిది గోత్రములవారికిని అర్ధగోత్రపువారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. 3మోషే రెండు గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు 4యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను రెండు గోత్రములవారు నివసించుటకు పట్టణములును వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీపభూములను మాత్రమేకాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. 5యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి.
6యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువయొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవిచేసెను–కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్నుగూర్చియు నిన్నుగూర్చియు చెప్పినమాట నీ వెరుగుదువు. 7దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలోనుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్లవాడను; ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. 8నాతోకూడ బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. 9ఆ దినమున మోషే ప్రమాణము చేసి–నీవు నా దేవుడైన యెహోవాను నిండుమనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా ఉండుననెను. 10యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను. 11మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధముచేయుటకుగాని వచ్చుచు పోవుచునుండుటకుగాని నాకెప్పటియట్లు బల మున్నది. 12కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన యీ కొండ ప్రదేశమును నాకు దయచేయుము; అనాకీయులును ప్రాకారముగల గొప్ప పట్టణములును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండినయెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. 13యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. 14కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటివరకు స్వాస్థ్యముగా నున్నది. 15పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధములేకుండ నెమ్మదిగా ఉండెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in