YouVersion Logo
Search Icon

ఎఫెసీయులకు 5

5
1కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి. 2క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. 3మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. 4కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను,#5:4 లేక, వెఱ్ఱిమాటలైనను. సర సోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు. 5వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. 6-7వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి#5:6-7 మూలభాషలో–అవిధేయ కుమారులమీదికి. వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి. 8మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. 9వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. 10గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి 11నిష్ఫలమైన అంధకారక్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి. 12ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులనుగూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది. 13సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా 14అందుచేత –నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
15-16దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 17ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. 18మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి. 19ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు, 20మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, 21క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.
22స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. 23క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. 24సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. 25-27పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను. 28అటువలెనే పురుషులు కూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. 29-30తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. 31ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు. 32ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను. 33మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy