YouVersion Logo
Search Icon

2 తిమోతికి 2

2
1నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. 2నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము, 3క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. 4సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు. 5మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. 6పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసినవాడు. 7నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము; అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. 8నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలోనుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము. 9నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు. 10అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. 11ఈ మాట నమ్మదగినది, ఏదనగా–మన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము. 12సహించిన వారమైతే ఆయనతోకూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును. 13మనము నమ్మదగని వారమైనను,#2:13 లేక, నమ్మకపోయినను. ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.#2:13 మూలభాషలో–ఆయన తన్ను తానెరుగననలేడు.
14వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. 15దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను#2:15 మూలభాషలో–సరిగా విభజించు వానిగాను. నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము. 16అపవిత్రమైన వట్టిమాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు. 17-18కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు; వారు–పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. 19అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది.
ప్రభువు తనవారిని ఎరుగును
అనునదియు
ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును
దుర్నీతినుండి తొలగిపోవలెను
అనునదియు దానికి ముద్రగా ఉన్నది. 20గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. 21ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. 22నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము,#2:22 మూలభాషలో–విడిచి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. 23నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము. 24-26సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును; అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపెట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని, ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy