YouVersion Logo
Search Icon

2 రాజులు 2

2
1యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీ షాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా 2ఏలీయా– యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా–యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. 3బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి–నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు–నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. 4పిమ్మట ఏలీయా–ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి. 5యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి–నేడు యెహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు–నేనెరుగుదును మీరు ఊరకుండుడనెను. 6అంతట ఏలీయా–యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు–యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి. 7ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దానునదిదగ్గర నిలిచిరి. 8అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి. 9వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి–నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా–నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. 10అందుకతడు–నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను. 11వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను 12ఎలీషా అది చూచి–నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను. 13మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి 14ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి–ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను. 15యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి–ఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి 16అతనితో ఇట్లనిరి–ఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏబదిమంది బలముగలవారున్నారు; మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము; యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక పర్వతము మీదనైనను లోయయందైనను వేసియుండునేమో అని మనవిచేయగా అతడు–ఎవరిని పంపవద్దనెను. 17అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడుదినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను. 18వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగి రాగా అతడు–వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను.
19అంతట ఆ పట్టణపువారు–ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నదిగాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సా రమై యున్నదని ఎలీషాతో అనగా 20అతడు–క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా 21అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, – యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ నీటిని నేను బాగుచేసియున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను. 22కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.
23అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి –బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యముచేయగా 24అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను. 25అతడు అచ్చటనుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చటనుండి పోయి షోమ్రోనునకు తిరిగివచ్చెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy