YouVersion Logo
Search Icon

1 రాజులు 22

22
1సిరియనులును ఇశ్రాయేలువారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 2మూడవ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలురాజునొద్దకు రాగా 3ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించి–రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి 4–యుద్ధము చేయుటకు నాతోకూడ నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు–నేను నీవాడనే; నా జనులు నీ జనులే నా గుఱ్ఱములును నీ గుఱ్ఱములే అని ఇశ్రాయేలురాజుతో చెప్పెను. 5పిమ్మట యెహోషాపాతు–నేడు యెహోవా యొద్ద విచారణచేయుదము రండని ఇశ్రాయేలురాజుతో అనగా 6ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించి–యుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారి నడిగెను. అందుకు–యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక 7పొండని వారు చెప్పిరిగాని యెహోషాపాతు–విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను. 8అందుకు ఇశ్రాయేలురాజు–ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతు–రాజైన మీరు ఆలాగనవద్దనెను. 9అప్పుడు ఇశ్రాయేలురాజు తన పరివారములో ఒకనిని పిలిచి–ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను. 10ఇశ్రాయేలురాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెలమీద ఆసీనులై యుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా 11కెనయనా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చి–వీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. 12ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచు– యెహోవా రామోత్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి. 13మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచిమాటలు పలుకుచు న్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా 14మీకాయా–యెహోవా నాకు సెలవిచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదుననెను. 15అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు–మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదుమీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడు–యెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను. 16అందుకు రాజు–నీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా 17అతడు–ఇశ్రాయేలీయులందరును కాపరిలేని గొఱ్ఱెలవలెనే కొండలమీద చెదరి యుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. 18అప్పుడు ఇశ్రాయేలురాజు యెహోషాపాతును చూచి–ఇతడు నన్నుగూర్చి మేలుపలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా 19మీకాయా యిట్లనెను–యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనా సీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని 20–అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. 21అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి–నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా –ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను. 22అందుకతడు–నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన–నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. 23యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు. 24మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి– నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను. 25అందుకు మీకాయా–దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియ వచ్చునని అతనితో చెప్పెను. 26అప్పుడు ఇశ్రాయేలురాజు–మీకాయాను పట్టుకొని తీసికొనిపోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషు నకును అప్పగించి 27–బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను. 28అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను–రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన యెడల యెహోవా నాచేత పలుకలేదు మరియు సకలజనులారా, నా మాట ఆలకించు డని చెప్పెను.
29ఇశ్రాయేలురాజును యూదారాజగు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా 30ఇశ్రాయేలురాజు–నేను మారువేషము వేసికొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసికొని యుద్ధమందు ప్రవేశించెను. 31సిరియారాజు తన రథములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి–అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడ వద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా 32రథాధిపతులు యెహోషాపాతును చూచి – యితడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలువేయగా 33రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపెట్టి అతని తరుముట మానివేసిరి. 34పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలురాజుకు కవచపుకీలుమధ్యను తగిలెను గనుక అతడు–నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములోనుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను. 35నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల యెదుట అతని రథముమీద నిలువ బెట్టిరి; అస్తమయమందు అతడు మరణమాయెను; తగిలిన గాయములోనుండి అతని రక్తము కారి రథములో మడుగు గట్టెను. 36సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమతమ పట్టణములకును దేశములకును వెళ్లి పోవచ్చునని ప్రచురమాయెను. 37ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను. 38వేశ్యలు స్నానముచేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. 39అహాబు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. 40అహాబు తన పితరులతోకూడ నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.
41ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలురాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. 42యెహోషాపాతు ఏల నారంభించినప్పుడు అతడు ముప్పది యయిదేండ్లవాడై యెరూషలేములో యిరువదియైదేండ్లు ఏలెను; అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీకుమార్తెయైయుండెను. 43అతడు తన తండ్రియైన ఆసాయొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తిం చుచు వచ్చెను. అయితే ఉన్నతస్థలములను తీసివేయ లేదు; ఉన్నతస్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి. 44యెహోషాపాతు ఇశ్రాయేలురాజుతో సంధిచేసెను. 45యెహోషాపాతు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు కనుపరచిన బలమునుగూర్చియు, అతడు యుద్ధముచేసిన విధమునుగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. 46తన తండ్రియైన ఆసా దినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను. 47ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనముచేయుచుండెను. 48యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను. 49అహాబు కుమారుడైన అహజ్యా–నా సేవకులను నీ సేవకులతోకూడ ఓడలమీద పోనిమ్మని యెహోషాపాతు నడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. 50పిమ్మట యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదుపురమందు తన పితరులతోకూడ పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను.
51అహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి రెండు సంవ త్సరములు ఇశ్రాయేలును ఏలెను. 52అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన తలిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను. 53అతడు బయలుదేవతను పూజిం చుచు, వానికి నమస్కారముచేయుచు, తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy