YouVersion Logo
Search Icon

1 కొరింథీయులకు 11

11
1నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.
2మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను#11:2 లేక–పారంపర్యములను. గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. 3ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను. 4ఏ పురుషుడు తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. 5ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. 6స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను. 7పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది. 8ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్తీనుండి కలుగలేదు. 9మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు. 10ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను. 11అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు. 12స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవునిమూలముగా కలిగియున్నవి. 13మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థిం చుట తగునా? 14పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచును గదా? 15స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్య బడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. 16ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలిసికొనవలెను.
17మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువ మేలుకు కాదు. 18మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ము చున్నాను. 19మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు. 20మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. 21ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనముచేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును. 22ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచు దురా? మీతో ఏమి చెప్పుదును? దీనినిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. 23నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 24దానిని విరిచి–యిది మీకొరకైన#11:24 అనేక ప్రాచీనప్రతులలో–మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము. నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. 25ఆప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని–యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. 26మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 27కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమునుగూర్చియు రక్తమునుగూర్చియు అపరాధియగును. 28కాబట్టి ప్రతిమనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను. 29ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. 31అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. 32మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము. 33కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. 34మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy