YouVersion Logo
Search Icon

1 దినవృత్తాంతములు 29

29
1తరువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఈలాగు సెలవిచ్చెను–దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయముగల బాలుడై యున్నాడు, కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. 2నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని. 3మరియు నా దేవుని మందిరముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులుగాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. 4గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారుచేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను 5ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా? 6అప్పుడు పితరులయిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి 7మనః పూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి. 8తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. 9వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.
10రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను–మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. 11యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. 12ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే. 13మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము. 14ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము. 15మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు 16మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమ కూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది. 17నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచు న్నాను. 18అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము. 19నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును, నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. 20ఈలాగు పలికిన తరువాత దావీదు–ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమపితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి. 21తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱె పొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱెపిల్లలను వాటి పానార్పణలతోకూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి. 22ఆ దినమునవారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. 23అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి. 24అధిపతులందరును యోధులందరునురాజైన దావీదు కుమారులందరునురాజైన సొలొమోనునకు లోబడిరి. 25యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదుటను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను.
26యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను. 27అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను. 28అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముది మిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. 29రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరిక మంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు, 30దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలనుబట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy