Logo ng YouVersion
Hanapin ang Icon

మత్తయి సువార్త 16

16
సూచకక్రియ కోసం బలవంతము చేయుట
1అప్పుడు కొందరు పరిసయ్యులు సద్దూకయ్యులు యేసును పరీక్షించడానికి వచ్చి, ఆకాశం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు.
2అందుకు ఆయన, “సాయంకాలమైనప్పుడు, ఆకాశం ఎరుపుగా ఉంటే వాతావరణము మామూలుగానే ఉందని, 3అలాగే ఉదయాన ఆకాశం ఎరుపుగా, మబ్బుగా ఉంది కాబట్టి ఈ రోజు గాలి వాన వస్తుందని మీరు చెప్తారు. ఆకాశం యొక్క వాతావరణ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు, కాని కాలాలను అర్థం చేసుకోలేరు. 4అయితే దుష్టులు, వ్యభిచారులైన తరం వారు సూచనను అడుగుతున్నారు, కానీ యోనా సూచన తప్ప వేరే ఏది వారికి ఇవ్వబడదు” అని చెప్పి యేసు వారిని విడిచి వెళ్లిపోయారు.
పరిసయ్యులు, సద్దూకయ్యుల పులిసిన పిండి
5యేసు శిష్యులు అవతలి ఒడ్డుకు వెళ్లినప్పుడు వారు రొట్టెలు తీసుకెళ్లడం మరచిపోయారు. 6యేసు వారితో, “పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని వారితో చెప్పారు.
7కాబట్టి వారు, “మనం రొట్టెలు తీసుకురాలేదు కాబట్టి ఇలా అన్నారు” అని తమలో తాము చర్చించుకున్నారు.
8వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, “అల్పవిశ్వాసులారా, రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? 9మీరు ఇంకా గ్రహించలేదా పోతున్నారా? అయిదు రొట్టెలు అయిదు వేలమందికి పంచినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు? 10లేదా ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపలు ఎత్తారు? 11నేను మీతో మాట్లాడుతుంది రొట్టెల గురించి కాదని మీకెందుకు అర్థం కాలేదు? మీరు పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి” అని వారితో చెప్పారు. 12అప్పుడు పులిసిన రొట్టెల పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు, సద్దూకయ్యులు చేస్తున్న బోధ గురించి జాగ్రత్త అని యేసు తమతో చెప్పాడని వారు గ్రహించారు.
యేసే క్రీస్తు అని తెలియజేసిన పేతురు
13యేసు కైసరయ ఫిలిప్పు ప్రాంతానికి వచ్చినప్పుడు, “మనుష్యకుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని తన శిష్యులను అడిగారు.
14వారు ఆయనతో, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అని, కొందరు ఏలీయా అని, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారని” జవాబిచ్చారు.
15అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకుంటున్నారు?” అని అడిగారు.
16అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు.
17అందుకు యేసు, “యోనా కుమారుడా సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములున్న వారి ద్వారా నీకు తెలియపరచబడలేదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతిని నీకు తెలియజేశారు. 18నీవు పేతురువు,#16:18 పేతురువు అంటే బండ ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను. 19పరలోక రాజ్యపు తాళపుచెవి నీకు ఇస్తున్నాను, నీవు భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకంలో బంధింపబడతాయి, అలాగే భూమి మీద వేటిని విప్పుతావో అవి పరలోకంలో విప్పబడతాయి” అని పేతురుతో చెప్పారు. 20ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పకూడదని ఆయన తన శిష్యులకు ఆదేశించారు.
తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు
21అప్పటినుండి యేసు తాను యెరూషలేము పట్టణానికి వెళ్లి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ రోజున తిరిగి లేస్తానని తన శిష్యులకు వివరించడం మొదలుపెట్టారు.
22అప్పుడు పేతురు, “ప్రభువా, అది నీ నుండి దూరమగు గాక, అలా నీకు ఎన్నడు జరుగకూడదు!” అని ఆయనను ప్రక్కకు తీసుకెళ్లి గద్దింపసాగాడు.
23అప్పుడు యేసు పేతురు వైపు తిరిగి, “సాతానా, నా వెనుకకు పో! నీవు నాకు ఆటంకంగా ఉన్నావు; నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు ఉన్నాయి” అన్నారు.
24అప్పుడు యేసు తన శిష్యులను చూసి, “ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. 25తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం తన ప్రాణానికి తెగించేవారు దాన్ని దక్కించుకొంటారు. 26ఎవరైనా లోకమంతా సంపాదించుకుని తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు? 27ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
28“ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యంతో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.

Haylayt

Ibahagi

Kopyahin

None

Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in

Video para sa మత్తయి సువార్త 16