โลโก้แอพพระคัมภีร์
ไอคอนค้นหา

లేవీయ 24

24
యెహోవా ఎదుట ఒలీవనూనె, రొట్టె ఏర్పాటు
1యెహోవా మోషేతో ఇలా అన్నారు, 2“వెలుగు కోసం దీపాలు నిరంతరం వెలుగుతూ ఉండేలా దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. 3సమావేశ గుడారంలో నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం వరకు నిత్యం యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. 4యెహోవా ఎదుట మేలిమి బంగారు దీపస్తంభంపై ఉన్న దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి.
5“నాణ్యమైన పిండి తీసుకుని ఒక్కొక్క రొట్టెకు రెండు ఓమెర్ల#24:5 అంటే సుమారు 3.2 కి. గ్రా. లు చొప్పున పన్నెండు రొట్టెలు చేయాలి. 6యెహోవా ఎదుట మేలిమి బంగారు బల్లపై, వాటిని ఒక వరుసకు ఆరు చొప్పున రెండు వరుసల్లో అమర్చాలి. 7రొట్టెను సూచించడానికి యెహోవాకు అర్పించే హోమబలిగా ఉండడానికి ప్రతి వరుస దగ్గర జ్ఞాపక భాగంగా కొంత స్వచ్ఛమైన ధూపం ఏర్పాటు చేయాలి. 8నిత్య నిబంధనగా, ఇశ్రాయేలు పక్షాన ప్రతి సబ్బాతు దినాన యెహోవా ఎదుట ఆ రొట్టెలను బల్లపై పెడుతూ ఉండాలి. 9అది అహరోను అతని కుమారులకు చెందినది, వారు దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినాలి, ఎందుకంటే ఇది యెహోవాకు సమర్పించిన హోమబలులలో వారి శాశ్వత వాటాలో అతిపరిశుద్ధమైన భాగము.”
దైవదూషకుడు చంపబడుట
10ఒక రోజు ఇశ్రాయేలు తల్లికి ఈజిప్టు తండ్రికి పుట్టిన కుమారుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్లాడు, అక్కడ శిబిరంలో అతనికి, ఒక ఇశ్రాయేలీయునికి మధ్య గొడవ జరిగింది. 11ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని దూషిస్తూ శపించాడు; కాబట్టి వారు అతన్ని మోషే దగ్గరకు తీసుకువచ్చారు. (అతని తల్లి పేరు షెలోమీతు, దాను గోత్రానికి చెందిన దిబ్రీ కుమార్తె.) 12యెహోవా చిత్తం వారికి తెలిసే వరకు వారు అతన్ని అదుపులో ఉంచారు.
13అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, 14“ఆ దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లు. అతని మాటలు విన్న వారంతా అతని తలపై చేతులుంచగానే సమాజమంతా రాళ్లతో అతన్ని కొట్టి చంపాలి. 15ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా తమ దేవున్ని శపిస్తే, తమ పాపశిక్షను భరించాలి; 16యెహోవా నామాన్ని ఎవరైనా దూషిస్తే, వారు మరణశిక్షకు గురి అవుతారు. సమాజమంత వారిని రాళ్లతో కొట్టి చంపాలి. విదేశీయులైనా, స్వదేశీయులైనా, యెహోవా నామాన్ని దూషిస్తే, వారికి మరణశిక్ష విధించాలి.
17“ ‘ఎవరైనా మనుష్యుని చంపితే వారికి మరణశిక్ష విధించాలి. 18ఎవరైనా జంతువును చంపితే ప్రాణానికి బదులుగా ప్రాణమిచ్చి నష్టపరిహారం చెల్లించాలి. 19పొరుగువారిని ఎవరైనా గాయపరిస్తే, వారిని కూడా అలాగే గాయపరచాలి: 20ఎముక విరగ్గొడితే ఎముక విరగ్గొట్టాలి, కంటికి కన్ను, పంటికి పన్ను. గాయం చేసిన మనుష్యునికి గాయం చేయాలి. 21ఎవరైనా జంతువును చంపితే నష్టపరిహారం చెల్లించాలి కాని ఎవరైనా మనిషిని చంపితే, వారికి మరణశిక్ష విధించాలి. 22విదేశీయులకు స్వదేశీయులకు ఒకే చట్టం ఉండాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”
23అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడిన తర్వాత వారు దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేశారు.

ที่ได้เลือกล่าสุด:

లేవీయ 24: TSA

เน้นข้อความ

คัดลอก

เปรียบเทียบ

แบ่งปัน

None

ต้องการเน้นข้อความที่บันทึกไว้ตลอดทั้งอุปกรณ์ของคุณหรือไม่? ลงทะเบียน หรือลงชื่อเข้าใช้