ద్వితీయో 27
27
ఏబాలు కొండమీద బలిపీఠం
1మోషే, ఇశ్రాయేలు పెద్దలు ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు: “ఈ రోజు మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని మీరు పాటించాలి. 2మీకు దేవుడైన యెహోవా ఇస్తున్న వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి యొర్దాను దాటిన రోజున, మీరు పెద్ద రాళ్లు నిలబెట్టి వాటికి సున్నం వేయాలి. 3మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్లే, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించడానికి మీరు దాటునప్పుడు ఈ చట్టం లోని పూర్తి మాటలను వాటిపై వ్రాయండి. 4మీరు యొర్దాను దాటినప్పుడు, సున్నం వేసిన ఈ రాళ్లను నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్లు ఏబాలు పర్వతం మీద నిలబెట్టండి. 5అక్కడ మీ దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం రాళ్లతో కట్టాలి. వాటిపై ఎలాంటి ఇనుప సాధనాన్ని వాడకూడదు. 6చెక్కని రాళ్లతో యెహోవాకు బలిపీఠం కట్టి దాని మీద దహనబలులు అర్పించాలి. 7అక్కడ సమాధానబలులు సమర్పించి, వాటిని తింటూ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి. 8మీరు నిలబెట్టిన రాళ్లమీద ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను స్పష్టంగా వ్రాయండి.”
ఏబాలు కొండ నుండి శాపాలు
9తర్వాత మోషే, లేవీయ యాజకులు ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా అన్నారు, “ఇశ్రాయేలూ, మౌనంగా ఉండి నేను చెప్పేది విను! ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రజలయ్యారు. 10మీరు దేవుడైన యెహోవాకు లోబడి, నేను మీకు ఈ రోజు ఇస్తున్న ఆయన ఆజ్ఞలను, శాసనాలను మీరు పాటించాలి.”
11ఆ రోజే మోషే ప్రజలకు ఆజ్ఞాపించాడు:
12మీరు యొర్దాను నది దాటిన తర్వాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రాల వారు గెరిజీము పర్వతం మీద నిలబడి ప్రజలను దీవించాలి. 13రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వారు ఏబాలు పర్వతం మీద నిలబడి, శాపాలు పలకాలి.
14లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరికి బిగ్గరగా ఇలా చెప్పాలి:
15“శిల్పి చేతులతో చెక్కబడి పోతపోయబడిన యెహోవాకు అసహ్యమైన విగ్రహాలను రహస్య స్థలంలో దాచుకునే వారెవరైనా శాపగ్రస్తులు” అని అన్నప్పుడు
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
16“తండ్రిని గాని తల్లిని గాని అవమానపరచే వారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
17“తన పొరుగువాడి సరిహద్దు రాయిని తీసివేసేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
18“గ్రుడ్డివాన్ని త్రోవ తప్పించేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
19“విదేశీయుల పట్ల, తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల న్యాయం తప్పి తీర్పు తీర్చేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
20“తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని తండ్రి పాన్పును అపవిత్రపరచినవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
21“ఏ జంతువుతోనైనా లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
22“తోబుట్టువుతో అనగా తన తండ్రి కుమార్తెతో గాని, తన తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
23“అత్తతో లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
24“పొరుగువాన్ని రహస్యంగా చంపేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
25“నిర్దోషి ప్రాణం తీయటానికి లంచం తీసుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
26“ఈ ధర్మశాస్త్రంలోని మాటలను అమలు చేయడం ద్వారా వాటిని పాటించనివారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
ที่ได้เลือกล่าสุด:
ద్వితీయో 27: TSA
เน้นข้อความ
คัดลอก
เปรียบเทียบ
แบ่งปัน
ต้องการเน้นข้อความที่บันทึกไว้ตลอดทั้งอุปกรณ์ของคุณหรือไม่? ลงทะเบียน หรือลงชื่อเข้าใช้
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.