YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 37:1-14

యెహెజ్కేలు 37:1-14 TELUBSI

యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన–నర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా–ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని. అందుకాయన–ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము–ఎండిపోయిన యెముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను; చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను. అప్పుడు ఆయన–నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా– జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము. ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను –నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు – మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతిమి అని యనుకొనుచున్నారు కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలుదేశములోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

Free Reading Plans and Devotionals related to యెహెజ్కేలు 37:1-14