YouVersion Logo
Search Icon

ఆదికాండము 40

40
యోసేపు కలల భావం చెప్పటం
1ఆ తరువాత ఫరో సేవకులు ఇద్దరు ఫరోకు అపకారం చేశారు. ఆ సేవకుల్లో ఒకడు రొట్టెలు కాల్చేవాడు. మరొకడు ద్రాక్షా పాత్రలు అందించేవారి పెద్ద. 2వంటల పెద్ద, ద్రాక్షా పాత్రల పెద్ద మీద ఫరోకు కోపం వచ్చింది. 3కనుక వారిని కూడా యోసేపు ఉన్న చెరసాలలోనే వేయించాడు. ఫరో రాజు సంరక్షకుల అధికారియైన పోతీఫరు ఈ చెరసాల అధికారి. 4ఈ ఇద్దరు ఖైదీలను యోసేపు బాధ్యతకు అప్పగించాడు అధికారి. ఆ ఇద్దరు మనుష్యులు కొన్నాళ్ల వరకు అలా చెరసాలలోనే ఉన్నారు. 5ఒక రాత్రి ఆ ఇద్దరు ఖైదీలకు కలలు వచ్చాయి. (ఈ ఇద్దరు ఖైదీలు ఈజిప్టు రాజు సేవకులు– ఒకడు రొట్టెలు కాల్చేవాడు, మరొకడు ద్రాక్షా పాత్రల పెద్ద). ఒక్కో ఖైదీకి ఒక్కో కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో భావం ఉంది. 6మర్నాడు ఉదయం యోసేపు వాళ్ల దగ్గరకు వెళ్లాడు. ఆ ఇద్దరు మనుష్యులు ఏదో చింతిస్తున్నట్లు యోసేపు గమనించాడు. 7“ఏమిటి, ఈ వేళ మీరు చాలా చింతిస్తున్నట్లు కనబడుతున్నారు?” అని వారిని అడిగాడు యోసేపు.
8“రాత్రి మాకు కలలు వచ్చాయి. కాని మేము కన్న కలలు మాకు అర్థం కాలేదు. ఆ కలలు ఏమిటో, వాటి భావం ఏమిటో మాకు వివరించే వాళ్లెవరూ లేరు” అని వాళ్లిద్దరు జవాబిచ్చారు.
యోసేపు, “కలలను తెలిసికొని, వాటి భావం చెప్పగలవాడు దేవుడు మాత్రమే కనుక దయచేసి మీ కలలు నాకు చెప్పండి” అని వారితో అన్నాడు.
ద్రాక్షా పాత్ర అందించే సేవకుని కల
9కనుక ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుతో తన కల చెప్పాడు. ఆ సేవకుడు ఇలా చెప్పాడు: “నా కలలో ఒక ద్రాక్షావల్లి కనబడింది. 10ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలున్నాయి. నేను చూస్తుండగా ఆ తీగెలకు పూలు పూసి, ద్రాక్షాగెలలు అయ్యాయి. 11నేను ఫరో పాత్ర పట్టుకొని ఉన్నాను. కనుక నేను ఆ ద్రాక్షాలను తీసుకొని ఆ పాత్రలో వాటి రసం పిండాను. అప్పుడు ఆ పాత్ర నేను ఫరోకు ఇచ్చాను.”
12అప్పుడు యోసేపు అన్నాడు: “ఆ కలను నీకు నేను వివరిస్తాను. మూడు కొమ్మలంటే మూడు రోజులు. 13మూడు రోజులు గతించక ముందే ఫరో నిన్ను క్షమించి, నిన్ను మళ్లీ నీ పని చేసుకోనిస్తాడు. ఇది వరకు నీవు ఫరో దగ్గర చేసిన పని నీవు మళ్లీ చేస్తావు. 14నీకు విడుదల అయింతర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. నా మీద దయ ఉంచి, నాకు సహాయం చేయి. నాకు కూడ ఈ చెరసాలలోనుంచి విముక్తి కలిగేటట్టు నా గురించి ఫరోతో చెప్పు. 15నన్ను అన్యాయంగా బలవంతంగా నా యింటినుండి నా ప్రజలైన హీబ్రూలనుండి తీసుకొనివచ్చారు. నేనేమి తప్పు చేయలేదు. అందుచేత నేను ఈ చెరసాలలో ఉండకూడదు.”
రొట్టెలు కాల్చేవాని కల
16మరో సేవకుని కల బాగున్నట్లు రొట్టెలు కాల్చేవాడికి తోచింది. వాడు యోసేపుతో అన్నాడు, “నాకూ ఒక కల వచ్చింది. నా తలమీద రొట్టెల బుట్టలు మూడు ఉన్నట్లు నాకు కనబడింది. 17పై బుట్టలో అన్ని రకాల కాల్చిన ఆహారాలు ఉన్నాయి. ఈ భోజనం రాజుగారి కోసం. కాని పక్షులు ఈ భోజనాన్ని తినేస్తున్నాయి.”
18యోసేపు ఇలా జవాబిచ్చాడు: “ఈ కల అర్థం ఏమిటో నీకు నేను చెబుతాను. మూడు బుట్టలు అంటే మూడు రోజులు. 19మూడు రోజులు గడవక ముందే రాజుగారు నిన్ను ఈ చెరసాలలోనుంచి విడుదల చేస్తారు. తర్వాత రాజుగారు నీ తల నరికేస్తాడు, నీ శరీరాన్ని ఒక స్తంభానికి వేలాడదీస్తాడు, పక్షులు నీ శరీరాన్ని తినివేస్తాయి.”
యోసేపును మర్చిపోవుట
20మూడు రోజుల తర్వాత రాజుగారి పుట్టిన రోజు వచ్చింది. ఫరో తన సేవకులందరికీ ఒక విందు చేశాడు. ఆ విందులో ఫరో తన రొట్టెలు కాల్చేవాడిని, ద్రాక్షా పాత్రల సేవకుణ్ణి చెరసాలలోనుంచి బయటకు రప్పించాడు. 21ద్రాక్షాపాత్రల సేవకుడ్ని ఫరో విడుదల చేశాడు. అతని ఉద్యోగం మరల ఫరో అతనికి ఇచ్చాడు. ద్రాక్షా పాత్రల సేవకుడు ద్రాక్షారసపు పాత్ర ఒకటి ఫరో చేతికి అందించాడు. 22కానీ ఫరో రొట్టెలు కాల్చే వాడిని చంపేశాడు. ఏమి జరుగుతుందని యోసేపు చెప్పాడో అంతా అలాగే జరిగింది. 23అయితే ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుకు సహాయం చెయ్యటం మరచిపోయాడు. యోసేపు విషయం ఫరోతో అతడేమీ చెప్పలేదు. ద్రాక్షాపాత్రల సేవకుడు యోసేపును గూర్చి మర్చిపోయాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy