YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 15

15
1కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనలను మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి. 2మన సాటిమనిషికి క్షేమాభివృద్ధి కలిగేలా మనలో ప్రతివాడూ మంచి విషయాల్లో అతణ్ణి సంతోషపరచాలి. 3క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. “నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి” అని రాసి ఉన్నట్టు ఆయనకు జరిగింది.
(7) రక్షణలో యూదు, యూదేతర విశ్వాసులు సమానమే
4ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం. 5మీరు ఒకే మనసుతో ఏక స్వరంతో అందరూ కలిసి, మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచడానికి, 6ఓర్పుకు, ఆదరణకు కర్త అయిన దేవుడు క్రీస్తు యేసును అనుసరించి మీ మధ్య ఐకమత్యం కలుగజేయు గాక.
7కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే దేవునికి మహిమ కలిగేలా మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి. 8నేను చెప్పేదేమిటంటే పితరులకు చేసిన వాగ్దానాల విషయం దేవుడు సత్యవంతుడని నిరూపించడానికీ, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి దేవుని మహిమపరచడానికీ క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు. 9దీని గురించి,
“ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది.
10ఇంకా ఏమని ఉన్నదంటే,
“యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ,
11“యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.”
12యెషయా ఇలా అన్నాడు,
“యెష్షయిలో నుండి వేరు చిగురు యూదేతరులను ఏలడానికి వస్తాడు.
ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు.”
13మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.
(8) అపొస్తలుని సేవ, ప్రయాణాలు
14సోదరులారా, మీరు మంచివారు, సంపూర్ణ జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను. 15అయినా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరింత ధైర్యం తెచ్చుకుని రాస్తున్నాను. 16ఎందుకంటే యూదేతరులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పవిత్రమై, దేవునికి ఇష్టమయ్యేలా, నేను సువార్త విషయం యాజక ధర్మం జరిగిస్తూ, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి యూదేతరులకు యేసుక్రీస్తు సేవకుడినయ్యాను. 17కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని సేవ విషయాల్లో నాకు అతిశయ కారణం ఉంది. 18అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్కు చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే తప్ప మరి ఇతర విషయాలు మాట్లాడను. 19కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను. 20నేను వేరొకడు వేసిన పునాది మీద కట్టకూడదని క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని బహు ఆశతో అలా ప్రకటించాను. 21దీన్ని గురించి ఇలా రాసి ఉంది,
“ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు,
ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”
22ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరికి రాకుండా నాకు చాలా సార్లు ఆటంకం కలిగింది. 23ఇక ఈ ప్రాంతాల్లో నేను వెళ్ళవలసిన స్థలం మిగిలి లేదు కాబట్టి, అనేక సంవత్సరాలుగా మీ దగ్గరికి రావాలని ఎంతో ఆశతో ఉన్నాను. 24కాబట్టి నేను స్పెయిను దేశానికి ప్రయాణించినప్పుడు దారిలో ముందు మిమ్మల్ని చూసి, మీ సహవాసంలో కొద్ది సమయం ఆనందించిన తరువాత, మీరు నన్ను అక్కడికి సాగనంపుతారని ఎదురు చూస్తున్నాను. 25అయితే ఇప్పుడు పరిశుద్ధుల పరిచర్య నిమిత్తం యెరూషలేము వెళ్తున్నాను. 26ఎందుకంటే యెరూషలేములోని పరిశుద్ధుల్లో పేదల కోసం మాసిదోనియ, అకయ విశ్వాసులు కొంత చందా పంపడానికి ఇష్టపడ్డారు. 27అవును, వీరు చాలా ఇష్టంగా ఆ పని చేశారు. నిజానికి వీరు వారికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు వారి ఆధ్యాత్మిక విషయాల్లో భాగం పంచుకున్నారు కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో వారికి సహాయం చేయడం సబబే. 28నేను ఈ ఫలాన్ని వారికప్పగించి నా పని ముగించిన తరువాత, మీ పట్టణం మీదుగా స్పెయినుకు ప్రయాణం చేస్తాను. 29నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు, క్రీస్తు సంపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.
30సోదరులారా, మీరు దేవునికి చేసే ప్రార్థనల్లో నా కోసం నాతో కలిసి పోరాడమని మన ప్రభు యేసు క్రీస్తును బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. 31ఎందుకంటే నేను యూదయలోని అవిధేయుల చేతుల్లో నుండి తప్పించుకోగలిగేలా, యెరూషలేములో చేయవలసిన నా పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమయ్యేలా, 32దేవుని చిత్తమైతే నేను సంతోషంతో మీ దగ్గరికి వచ్చి, మీతో కలిసి సేద దీరడానికి వీలు కలిగేలా ప్రార్ధించండి. 33సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడుగా ఉండు గాక. ఆమేన్‌.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in