YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథం 5

5
ఏడు సీళ్ళు వేసి ఉన్న గ్రంథం
1అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో ఏడు సీలులతో గట్టిగా మూసి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను. ఆ గ్రంథం వెనకా లోపలా రాసి ఉంది. 2బలిష్టుడైన ఒక దేవదూత, “ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను. 3కానీ ఆ గ్రంథాన్ని తెరవడానికైనా, చూడడానికైనా పరలోకంలో భూమి మీదా భూమి కిందా ఎవరికీ సామర్థ్యం లేకపోయింది. 4ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవారు ఎవరూ కనబడక పోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను.
5అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “ఏడవకు. చూడు, ఏడు సీలులను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహమూ, దావీదు వేరూ అయిన వ్యక్తి జయించాడు” అన్నాడు.
క్రీస్తు ఆ గ్రంథం విప్పడం
6సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ ఏడు కళ్ళూ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు. 7గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు.
మనుషుల విమోచనకై పెద్దల ఆరాధన
8ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యాలూ ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు.
9ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు. 10మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశావు. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు” అంటూ ఒక కొత్త పాట పాడారు.
11ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది. 12వారు, “వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు” అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు.
13అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా “సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!” అనడం నేను విన్నాను.
14ఆ నాలుగు ప్రాణులూ, “ఆమేన్‌” అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in