YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథం 11

11
యూదేతరుల కాలం
1కొలబద్దలా ఉపయోగించడానికి ఒక చేతి కర్రను నాకిచ్చారు. అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు. “నువ్వు లే. దేవుని ఆలయం, బలిపీఠం కొలతలు తీసుకో. ఆలయంలో ఎంతమంది ఆరాధిస్తున్నారో లెక్క పెట్టు. 2ఆలయం బయటి ఆవరణం మాత్రం కొలవకు. అది యూదేతరులది. వారు నలభై రెండు నెలల పాటు ఈ పరిశుద్ధ పట్టణాన్ని తమ కాళ్ళ కింద తొక్కుతారు.
ఇద్దరు సాక్షులు 42 నెలల కార్యకలాపాలు
3“నా ఇద్దరు సాక్షులు గోనెపట్ట కట్టుకుని 1, 260 రోజులు దేవుని మాటలు ప్రకటించడానికి వారికి అధికారం ఇస్తాను.” 4భూమికి ప్రభువైన వాని సన్నిధిలో ఉండే రెండు ఒలీవ చెట్లు, రెండు దీపస్తంభాలు వీరే. 5ఎవరైనా వీరికి హని చేయాలని చూస్తే, వారి నోటి నుండి అగ్ని జ్వాలలు బయల్దేరి వారి శత్రువులను దహించి వేస్తాయి. కాబట్టి ఎవరైనా హాని చేయాలని చూస్తే వారికి అలాంటి మరణమే కలగాలి.
6తాము ప్రవచించే రోజుల్లో వాన కురవకుండా ఆకాశాన్ని మూసి ఉంచే అధికారం వారికి ఉంటుంది. అలాగే తాము తలచుకున్నపుడల్లా నీటిని రక్తంగా చేయడానికీ అన్ని రకాల పీడలతో భూమిని వేధించడానికీ వారికి అధికారం ఉంది. 7వారు తమ సాక్షాన్ని ప్రకటించి ముగించగానే లోతైన అగాధంలో నుండి వచ్చే కౄర మృగం వారితో యుద్ధం చేస్తుంది. వారిని ఓడించి చంపుతుంది. 8వారి మృత దేహాలు ఆ మహా పట్టణం వీధుల్లో పడి ఉంటాయి. ఆ పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సోదొమ అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు. 9మనుషుల్లో, అన్ని జాతుల వారిలో, రకరకాల భాషలు మాట్లాడే వారిలో, తెగల వారిలో కొందరు వీరి మృత దేహాలను చూస్తూ మూడున్నర రోజులు వీరిని సమాధిలో పెట్టనివ్వరు. 10ఈ ఇద్దరు ప్రవక్తలు భూమిపై నివసించే వారిని వేధించారు గనక వారికి పట్టిన గతిని చూసి వారంతా సంతోషిస్తారు. సంబరాలు చేసుకుంటారు. ఒకరికొకరు బహుమానాలు పంపుకుంటారు.
11కాని మూడున్నర రోజులైన తరువాత దేవుని దగ్గర నుండి జీవాన్నిచ్చే ఊపిరి వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. వారు లేచి తమ కాళ్ళపై నిలబడతారు. ఇది చూసిన వారికి విపరీతమైన భయం కలుగుతుంది. 12అప్పుడు, “ఇక్కడికి పైకి రండి” అని ఒక స్వరం బిగ్గరగా తమకు చెప్పడం వారు విని మేఘాలపై ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతారు. వారు వెళ్తుండగా వారి శత్రువులు వారిని చూస్తారు.
రెండవ యాతన
13సరిగ్గా ఆ గంటలోనే ఒక మహా భూకంపం వస్తుంది. దాని మూలంగా పట్టణంలో పదవ భాగం కూలిపోతుంది. ఆ భూకంపంలో ఏడు వేలమంది చచ్చిపోతారు. చావకుండా మిగిలి ఉన్నవారు భయకంపితులై పరలోకంలో ఉన్న దేవుణ్ణి కీర్తిస్తారు. 14రెండవ యాతన ముగిసింది. ఇప్పుడు మూడవ యాతన త్వరలో ప్రారంభం కానుంది.
రెండవ వివరణ దర్శనం సమాప్తం. ఏడవ బాకా
15ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.” 16అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు.
17“ప్రభువైన దేవా, సర్వ శక్తిశాలీ, పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు. 18జనాలకు క్రోధం పెరిగిపోయింది. కాని నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికీ, నీ సేవకులైన ప్రవక్తలకీ పరిశుద్ధులకీ గొప్పవారైనా అనామకులైనా నీ పేరు అంటే భయభక్తులు ఉన్న వారికి పారితోషికాలు ఇవ్వడానికీ, భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికీ సమయం వచ్చింది” అన్నారు.
19అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది. దేవుని నిబంధన మందసం అందులో కనిపించింది. అప్పుడు మెరుపులూ, గొప్ప శబ్దాలూ, ఉరుములూ, భూకంపమూ కలిగాయి. పెద్ద వడగళ్ళు పడ్డాయి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in