YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథం 1

1
ముందు మాటలు
1ఇది త్వరలో జరగాల్సిన సంగతులను యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దేవదూతను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతులను తెలియజేశాడు. 2యోహాను దేవుని వాక్కును గురించీ యేసు క్రీస్తు సాక్షాన్ని గురించీ తాను చూసినదానంతటికీ సాక్షిగా ఉన్నాడు.
3ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడూ, వాటిని వినే వారూ, వాటి ప్రకారం నడుచుకునే వారూ ధన్య జీవులు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.
4ఆసియలో ఉన్న ఏడు సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు. పూర్వం ఉండి, ప్రస్తుతం ఉంటూ, రానున్న వాడి నుండీ, ఆయన సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల నుండీ, 5నమ్మకమైన సాక్షీ, చనిపోయిన వారిలో నుండి ప్రథముడిగా లేచిన వాడూ, భూరాజులందరి పరిపాలకుడూ అయిన యేసు క్రీస్తు నుండీ కృపా, శాంతీ మీకు కలుగు గాక. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మనలను మన పాపాల నుండి విడిపించాడు. 6మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగానూ, యాజకులుగానూ చేశాడు. ఆయనకు కీర్తి యశస్సులూ, అధికారమూ కలకాలం ఉంటాయి గాక!
7చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు.
ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు.
భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు.
8 “ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు.
పత్మసులో యోహానుకు క్రీస్తు విశ్వరూపం
9మీ సోదరుణ్నీ, యేసు కోసం కలిగే హింసలోనూ, రాజ్యంలోనూ, ఓర్పులోనూ మీలో ఒకడినీ అయిన యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మసు ద్వీపంలో ఉన్నాను.
10ప్రభువు దినాన నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు భేరీనాదం లాంటి ఒక పెద్ద స్వరం 11నా వెనక వినిపించింది. “నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దాన్ని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు” అని చెప్పడం విన్నాను.
12అది వింటూనే “ఎవరిదీ స్వరం?” అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను. 13ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడిలాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు. 14ఆయన తల, తల వెంట్రుకలూ ఉన్నిలాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి. 15ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ తళతళ మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠ స్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది. 16ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది.
17నేను ఆయనను చూడగానే నిశ్చేష్టు డి నా ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, “భయపడకు, మొదటివాణ్ణీ చివరివాణ్ణీ నేనే. 18జీవిస్తున్నవాణ్ణీ నేనే. చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి. 19ఇప్పుడు నువ్వు చూసిన సంగతులనూ ప్రస్తుతమున్న సంగతులనూ, వీటి తరువాత జరగబోయే సంగతులనూ రాయి.
20 నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు, ఆ ఏడు బంగారు దీపస్తంభాల రహస్యం ఇది, ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు. ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in