YouVersion Logo
Search Icon

కీర్తన 45

45
ప్రధాన సంగీతకారుడి కోసం, శోషన్నిము రాగం పై పాడాలి. కోరహు వారసుల దైవ ధ్యానం. ఒక ప్రేమ గీతం.
1నా హృదయం ఒక శ్రేష్ఠమైన విషయంతో నిండి పొంగి పొర్లుతున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని బిగ్గరగా చదువుతాను. నా నాలుక వేగంగా రాసేవాడి కలంలా ఉంది.
2మనుషులందరి కంటే నువ్వు అందంగా ఉన్నావు. దయా కనికరాలు నీ పెదాలపై పోశారు. కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదించాడని మాకు తెలుస్తూ ఉంది.
3బలశాలీ, నీ నడుముకు కత్తిని ధరించు. నీ తేజస్సునూ నీ ప్రభావాన్నీ ధరించుకో.
4నీ విశ్వసనీయత, నీ వినయం, నీ నీతి కారణంగా నీ రాజసంతో వాహనంపై విజయోత్సవంతో బయల్దేరు. నీ కుడిచెయ్యి భయాన్ని పుట్టించే సంగతులను నీకు నేర్పుతుంది.
5నీ బాణాలు పదునైనవి. నీ ఎదుట ప్రజలు కూలిపోతారు. రాజు శత్రువు గుండెల్లో నీ బాణాలు గుచ్చుకుని ఉంటాయి.
6దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయ రాజదండం.
7నువ్వు నీతిని ప్రేమించావు. దుర్మార్గతను అసహ్యించుకున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించాడు.
8నువ్వు ధరించే బట్టలన్నీ బోళం, అగరు, దాల్చినచెక్క పరిమళాల వాసనే. ఏనుగు దంతపు భవనాల నుండి వినిపించే తీగ వాయిద్యాల నాదాలు నిన్ను సంతోషపెడుతున్నాయి.
9గౌరవనీయులైన నీ స్త్రీలలో రాజ కుమార్తెలున్నారు. ఓఫీరు దేశపు స్వర్ణాభరణాలు ధరించుకుని రాణి నీ కుడి వైపున నిలబడి ఉంది.
10కుమారీ, విను, ధ్యాస పెట్టి ఆలకించు. నీ తండ్రి కుటుంబాన్నీ, నీ సొంతవాళ్ళనీ మర్చిపో.
11ఈ విధంగా రాజు నీ సౌందర్యాన్ని ఆశిస్తాడు. ఆయన నీ ప్రభువు. ఆయన్ని పూజ్యభావంతో గౌరవించు.
12తూరు కుమార్తె తన కానుకతో అక్కడికి వస్తుంది. ప్రజల్లో సంపన్నులు నీ ప్రాపకం కోసం ప్రాధేయపడతారు.
13అంతఃపురంలో ఉన్న రాజకుమారి వైభవంగా ఉంది. ఆమె దుస్తులు బంగారంతో నేసినవి.
14వివిధ రంగులతో అల్లిక చేసిన దుస్తులు వేసుకున్న ఆమెను రాజు దగ్గరకు తీసుకువస్తున్నారు. ఆమె వెంట ఆమెను అనుసరించే ఆమె చెలికత్తెలైన కన్యలను నీ దగ్గరకు తీసుకువస్తున్నారు.
15ఆనందోత్సాహలతో వాళ్ళను తీసుకువస్తున్నారు. వాళ్ళంతా రాజ భవనంలో ప్రవేశిస్తున్నారు.
16నీ పితరులకు బదులుగా నీ పిల్లలుంటారు. వాళ్ళను నువ్వు భూమి అంతట్లో అధిపతులుగా నియమిస్తావు.
17అన్ని తరాల్లోనూ నీ నామం జ్ఞాపకం ఉండేలా నేను చేస్తాను. కాబట్టి ప్రజలు అన్ని తరాల్లో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తన 45