YouVersion Logo
Search Icon

నహూ 2

2
నీనెవే పట్టణపు ముట్టడి, నాశనం
1నీనెవే పట్టణమా, నాశనకారుడు నీ మీదికి వస్తున్నాడు. నీ కోటలకు, దారుల వెంబడి కాపలా ఉంచుకో. నడుం బిగించుకుని తీవ్రంగా ఎదిరించు. 2దోపిడీ దారులు యాకోబు సంతతి వారిని దోచుకున్నా వాళ్ళ ద్రాక్ష తోటలను నరికివేసినా ఇశ్రాయేలీయుల వైభవం వలే యెహోవా యాకోబు సంతతి వారికి పూర్వ వైభవం తిరిగి కల్పిస్తాడు.
3ఆయన శూరుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి. పరాక్రమశాలురు ఎర్రని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు, వ్యూహాలు పన్నే రోజున ఆయన సైన్యం, రథాలు మెరుగు పెట్టిన ఉక్కులాగా మెరిసిపోతున్నాయి. సరళవృక్షం కలపతో చేసిన ఈటెలను వీరులు అటూ ఇటూ ఊపుతున్నారు. 4వీధుల్లో రథాలు అతి వేగంగా పరుగులు పెడుతున్నాయి. రాజ వీధుల్లో రథాలు ఒక దానిపై ఒకటి పడేంత వేగంగా పరుగెత్తుతున్నాయి, అవి దివిటీల్లాగా కనిపిస్తున్నాయి. మెరుపుల్లాగా వేగంగా వెళ్తున్నాయి.
5మిమ్మల్ని ముక్కలుచెక్కలు చేసే వాడు తన పరాక్రమశాలురను పిలిపిస్తున్నాడు. వాళ్ళు రహదారుల్లో పరుగులు పెడుతూ తొట్రుపడతారు. ప్రాకారం దగ్గరికి పరుగెత్తి వచ్చి దాడి చేసే వారి భద్రత కోసం ఏర్పాట్లు చేస్తారు. 6నదులకు ఎదురుగా ఉన్న ద్వారాలను తెరుస్తున్నారు. రాజ నగరు కూలిపోతున్నది. 7రాణిని నగ్నంగా చేసి ఈడ్చుకుపోతున్నారు. ఆమె దాసీలు గువ్వల్లాగా మూలుగుతున్నారు. రొమ్ము కొట్టుకుంటున్నారు.
8నీనెవె పట్టణం నిర్మాణమైనప్పటి నుండి నీటికొలనులాగా ఉంది. ఆ పట్టణ ప్రజలు పారిపోతున్నారు. ఆగండి, ఆగండి అని పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూసేవాడు ఒక్కడు కూడా లేడు.
9అది లెక్కలేనన్ని వివిధ విచిత్ర ఆభరణాలతో నిండి ఉంది. వెండి కొల్లగొట్టండి, బంగారం కొల్లగొట్టండి. 10అది ఏమీ లేకుండా ఖాళీగా, పాడుబడిపోతుంది. ప్రజల గుండెలు నీరైపోతున్నాయి. వాళ్ళ మోకాళ్లు వణకుతున్నాయి, అందరిలో వేదన ఉంది. అందరి ముఖాలు తెల్లబోతున్నాయి.
11సింహాల గుహ ఏమయింది? సింహపు పిల్లల మేత మేసే స్థలం ఏమయింది? ఎవరి భయం లేకుండా సింహం, ఆడ సింహం, సింహం పిల్లలు తిరిగిన స్థలం ఏమయింది? 12తన పిల్లలకు కావలసినంత తిండి సమకూరుస్తూ, ఆడ సింహాలకు కావలసినంత ఎర కడుపారా నింపుతూ, తన గుహలను, నివాసాలను వేటాడి తెచ్చిన మాంసంతో నింపిన సింహం ఏమైయింది?
13సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు, నేను నీకు విరోధిని. నీ రథాలను వాటి పొగ పైకి ఎగబ్రాకేలా కాల్చివేస్తాను. సింహం పిల్లలు నీ కత్తి వేటుకు గురౌతాయి. నీకు ఏమీ దొరకకుండా నీకు చెందినదంతా భూమిలో నుండి తీసివేస్తాను. నీ వార్తాహరుల స్వరం ఇకపై వినబడకుండా చేస్తాను.

Currently Selected:

నహూ 2: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in